Share News

కోర్టుకు రానందుకు అరెస్టు వారెంట్‌ ఇస్తాం

ABN , Publish Date - Jun 26 , 2026 | 04:35 AM

ఓ కోర్టు ధిక్కరణ కేసులో ప్రత్యక్షంగా హాజరై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీచేసినప్పటికీ పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి యోగితారాణా పట్టించుకోకపోవడంపై.....

కోర్టుకు రానందుకు అరెస్టు వారెంట్‌ ఇస్తాం

  • ఐఏఎస్‌ యోగితా రాణాకు హైకోర్టు హెచ్చరిక

  • అనంతరం వర్చువల్‌గా హాజరై క్షమాపణలు

హైదరాబాద్‌, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): ఓ కోర్టు ధిక్కరణ కేసులో ప్రత్యక్షంగా హాజరై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీచేసినప్పటికీ పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి యోగితారాణా పట్టించుకోకపోవడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కారుణ్య నియామకానికి సంబంధించిన కేసులో 2023లో ఇచ్చిన తీర్పు అమలుకాకపోవడంపై కోర్టు ధిక్కరణ కేసు నమోదైంది. గురువారం ఐఏఎస్‌ యోగితారాణా హాజరుకావాల్సి ఉండగా కనీసం ఎందుకు రావడంలేదో కారణం వివరిస్తూ మినహాయింపు కోరకపోవడంపై జస్టిస్‌ టీ మాధవీదేవి అసహనం వ్యక్తంచేశారు. ‘కోర్టుకు ఆమె ఇచ్చే మర్యాద ఇదేనా? న్యాయవాదులు క్షమాపణ చెప్తే సరిపోదు. ఆమెకు వ్యతిరేకంగా అరెస్ట్‌ వారెంట్‌ ఇస్తాం. కోర్టు నోటీసును చాలా తేలికగా తీసుకుంటున్నారు. ఈ కోర్టు ఆమెపై చర్య తీసుకుంటుంది.’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. హైకోర్టు ఆగ్రహం నేపథ్యంలో మధ్యాహ్నం యోగితా రాణా వర్చువల్‌గా హాజరై బేషరుతుగా క్షమాపణ తెలిపారు. మూడువారాల్లో కోర్టు తీర్పు అమలు చేస్తానని చెప్పారు.

Updated Date - Jun 26 , 2026 | 04:35 AM