హైడ్రా.. తనకు తాను జడ్జి, కోర్టు అనుకుంటోంది
ABN , Publish Date - Feb 22 , 2026 | 07:10 AM
హైడ్రా తనకు తానే ఓ న్యాయనిర్ణేతగా, న్యాయస్థానంలా వ్యవహరిస్తూ నిర్ణయాలు తీసుకుంటోందని..
ప్రభుత్వ భూములని చెబుతూ హైడ్రా
ఫెన్సింగ్ వేయడంపై కేసులు పెరుగుతున్నాయి
ప్రభావిత వ్యక్తులకు నోటీసులిచ్చాకే ఫెన్సింగ్ వేయాలి
సర్కారు భూముల జాబితాను గెజిట్‌లో ప్రచురించాలి
ఎప్పటికప్పుడు ఆ జాబితాను నవీకరించాలి: హైకోర్టు
హైదరాబాద్, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): హైడ్రా తనకు తానే ఓ న్యాయనిర్ణేతగా, న్యాయస్థానంలా వ్యవహరిస్తూ నిర్ణయాలు తీసుకుంటోందని.. ఆ ధోరణి చెల్లదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎటువంటి టైటిల్ పత్రాలు, డాక్యుమెంట్లు లేకుండానే వివాదాస్పద లేదా ప్రైవేటు భూముల చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేయిస్తోందని, ఆపై హైడ్రా సంరక్షణలో ఉన్న స్థలం అని బోర్డులు పెడుతోందని హైకోర్టు ఆక్షేపించింది. హైదరాబాద్ జిల్లా గోల్కొండ మండలం గుడిమల్కాపూర్ సర్వే నంబర్ 104లో తమకు చెందిన 1351 చదరపు గజాల స్థలం చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేయడాన్ని సవాల్ చేస్తూ ప్రసాద్ ఎన్ తంజేర్ల అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం హైడ్రా తీరు పట్ల అసహనం వ్యక్తం చేసింది. వివాదాస్పద భూముల చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేయడం, బోర్డులు పెట్టడంపై భారీగా కేసులు పెరిగిపోతున్నాయని వ్యాఖ్యానిస్తూ ప్రభుత్వానికి పలు మార్గదర్శకాలు జారీచేసింది. ప్రభుత్వ భూములు లేదా ప్రభుత్వానికి ఆసక్తి ఉన్న భూముల జాబితాను అధికారిక గెజిట్‌లో ప్రచురించాలని పేర్కొంది. వివాదాల పరిష్కారాన్ని బట్టి సదరు జాబితాను ఎప్పటికప్పుడు నవీకరించాలని పేర్కొంది. అలాగే జీహెచ్‌ఎంసీ చట్టంలోని సెక్షన్ 374-బీ పేర్కొన్న స్వభావం కలిగిన భూములు ఎన్ని ఉన్నాయో జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌లో పెట్టాలని పేర్కొంది. ఇలా చేయడం వల్ల ప్రభావిత వ్యక్తులు, సంస్థలు వారి టైటిల్ పత్రాలను సరిచూసుకొని వారి ప్లాట్ల స్థితిగతులు ఏమిటనేది ఎప్పటికప్పుడు నిర్ధారించుకుంటారని తెలిపింది. ప్రభుత్వ భూములు లేదా వివాదాస్పద భూములకు సంబంధించిన కేసుల్లో ప్రభుత్వం లేదా మునిసిపల్ కార్పొరేషన్ పార్టీగా ఉంటే.. సదరు భూములపై తుది తీర్పులు వెలువడే వరకు హైడ్రా జోక్యం చేసుకోవడానికి వీల్లేదని స్పష్టంచేసింది. సమగ్రమైన కసరత్తు, పారదర్శక విధానం లేకుండా భూములకు ఫెన్సింగ్ వేసుకుంటూ పోతే ప్రైవేటు ఆస్తుల యజమానుల హక్కులకు తీవ్ర భంగం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. తగిన కసరత్తు లేకుండా హైడ్రా తనకు తానే నిర్ణయాలు తీసుకుని ఫెన్సింగ్ వేయడం కుదరదని.. చట్టవిరుద్ధంగా తనకు తానే న్యాయనిర్ణేతగా, న్యాయస్థానంగా భావించడం చెల్లదని పేర్కొంది. ప్రస్తుత కేసులో పిటిషనర్‌కు సంబంధించిన భూమిలో వారం రోజుల్లో ఫెన్సింగ్, బోర్డు తొలగించాలని.. పిటిషనర్ కూడా ఆ భూమి స్వభావాన్ని మార్చరాదని పేర్కొంది. తదుపరి విచారణ మార్చి 3కు వాయిదా పడింది.