High Court: డీజీపీ నియామకంపై నేడు హైకోర్టు ఉత్తర్వులు
ABN , Publish Date - Jan 09 , 2026 | 05:31 AM
డీజీపీ శివధర్‌రెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం ఉత్తర్వులు వెలువరించనున్నట్లు హైకోర్టు పేర్కొంది...
మా ప్రతిపాదనలను యూపీఎస్సీ తిప్పిపంపింది: రాష్ట్రం
అటార్నీ జనరల్ సలహా మేరకే వ్యవహరించాం:యూపీఎస్సీ
హైదరాబాద్, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): డీజీపీ శివధర్‌రెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం ఉత్తర్వులు వెలువరించనున్నట్లు హైకోర్టు పేర్కొంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా డీజీపీ నియామకం జరిగిందని పేర్కొంటూ టీ ధన్‌గోపాలరావు అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం జస్టిస్ పుల్ల కార్తీక్ ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఇటీవల హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ నియామకం కోసం సీనియర్ ఐపీఎ్‌సల జాబితాను యూపీఎస్సీకి అందజేసిందని పేర్కొన్నారు. అయితే ఆలస్యం అయిందనే కారణం చూపుతూ దానిని తిప్పి పంపిందని, ఈ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు పాటించలేదని పేర్కొన్నారు. యూపీఎస్సీ తరఫు న్యాయవాది అజయ్‌కుమార్ వాదిస్తూ.. బాగా ఆలస్యంగా డీజీపీ నియామకం కోసం జాబితా పంపారని తెలిపారు. దీనిపై అటార్నీ జనరల్ నుంచి న్యాయసలహా తీసుకున్న తరువాత జాబితాను యూపీఎస్సీ తిప్పి పంపినట్టు తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీచేస్తామని పేర్కొంటూ విచారణను వాయిదా వేసింది.