బొగ్గు గని కార్మికులతో కఠినంగా వ్యవహరించకండి
ABN , Publish Date - Mar 25 , 2026 | 04:20 AM
ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేసే బొగ్గుగని కార్మికుల పట్ల మానవత్వంతో వ్యవహరించాలని సింగరేణి యాజమాన్యానికి హైకోర్టు సూచించింది.
సింగరేణికి హైకోర్టు సూచన
హైదరాబాద్, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేసే బొగ్గుగని కార్మికుల పట్ల మానవత్వంతో వ్యవహరించాలని సింగరేణి యాజమాన్యానికి హైకోర్టు సూచించింది. కేవలం భౌతికంగా శారీరక వైకల్యం ఉన్న వారికే కాకుండా సాధారణ శారీరక బలహీనత అంటే గుండె జబ్బులు, దీర్ఘకాలిక రోగాలు ఉన్న కార్మికులకు సైతం ఒకేలా ప్రయోజనాలు కల్పించాలని పేర్కొంది. భౌతిక వైకల్యం ఉన్న వారితో పోలిస్తే సాధారణ శారీరక బలహీనత ఉన్నవారి పట్ల వివక్ష చూపిస్తున్నారని పేర్కొంటూ హైకోర్టులో దాదాపు 80 పిటిషన్‌లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్‌ల ధర్మాసనం.. కార్మికుల ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా అందరికీ ఒకేలా ప్రయోజనాలు కల్పించాలని పేర్కొంటూ తుది తీర్పు ప్రకటించింది.