పంచాయతీల్లో పాలన కోసం కమిటీ
ABN , Publish Date - Apr 03 , 2026 | 05:36 AM
గ్రామ పంచాయతీల కాలపరిమితి ముగిసిన నేపథ్యంలో వాటి పాలన వ్యవహారాలు చూసేందుకు ప్రత్యేక అధికారితో పాటు ఆయా పంచాయతీల్లోని ఇద్దరు...
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచన
ప్రభుత్వంతో చర్చించి వివరాలివ్వండి: ఏజీకి ధర్మాసనం ఆదేశం
అమరావతి, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీల కాలపరిమితి ముగిసిన నేపథ్యంలో వాటి పాలన వ్యవహారాలు చూసేందుకు ప్రత్యేక అధికారితో పాటు ఆయా పంచాయతీల్లోని ఇద్దరు, ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వంతో చర్చించి, వివరాలు తమ ముందు ఉంచాలని అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివా్‌సకు సూచించింది. విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారుల నియమకం కోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్.రఘునందనరావుతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. బీసీ జనగణన చేపట్టడంతో పాటు తదనుగుణంగా రిజర్వేషన్లు ఖరారైన తరువాతే స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు 2025లో పిల్ దాఖలు చేశారు. అలాగే రాష్ట్రంలోని 13,325 గ్రామ పంచాయతీలు, 123 పట్టణ స్థానిక సంస్థలకు త్వరలో పదవీకాలం ముగియనుందని, ఎన్నికల నిర్వహణకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ న్యాయవాది తాండవ యోగేశ్ మరో పిల్ వేశారు. పంచాయతీ సర్పంచ్‌లుగా తమ పదవీ కాలాన్ని పొడిగించాలని కోరుతూ మరికొందరు వ్యాజ్యాలు దాఖలు చేశారు. గురువారం ఈ వ్యాజ్యాలన్నింటిపై హైకోర్టు విచారణ జరిపింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ... రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకం త్వరలో జరుగుతుందని పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో బీసీ కోటా ఖరారు చేసేందుకు రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఏర్పాటు చేశామని, అధ్యయనం పూర్తి చేసేందుకు 45 రోజుల సమయం పడుతుందని వెల్లడించారు. ఏప్రిల్ 2న పంచాయతీల కాలపరిమితి ముగుస్తున్న నేపథ్యంలో పరిపాలన వ్యవహారాలు చూసుకొనేందుకు ప్రత్యే అధికారులను నియమించామని తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ... పంచాయతీల పాలన ప్రత్యేక అధికారులపై అదనపు భారమని, రెండు, మూడు పంచాయతీలకు ఒకే అధికారిని ఇన్‌చార్జిగా నియమిస్తే పర్యవేక్షణ చేయడం కష్టమవుతుందని తెలిపింది.