మీరు ఇవ్వరు.. వసూలు చేసుకోనివ్వరు!
ABN , Publish Date - Jun 25 , 2026 | 04:20 AM
కాలేజీ యాజమాన్యాలకు విద్యార్థుల రీయింబర్స్‌మెంట్ ఫీజు బకాయిలు ఇవ్వరు. విద్యార్థుల నుంచి వసూలు చేసుకోనివ్వరు. ఇలాంటి పరిస్థితుల్లో ....
ప్రైవేటు కాలేజీలు ఎలా నడవాలి?
ఫీజు బకాయిల్ని ఎప్పటిలోగా చెల్లిస్తారు?
నేరుగా విద్యార్థుల ఖాతాల్లో జమచేయడంపై స్పష్టత ఇవ్వండి
ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
విచారణ నేటికి వాయిదా
హైదరాబాద్, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): ‘కాలేజీ యాజమాన్యాలకు విద్యార్థుల రీయింబర్స్‌మెంట్ ఫీజు బకాయిలు ఇవ్వరు. విద్యార్థుల నుంచి వసూలు చేసుకోనివ్వరు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేటు కాలేజీలు ఎలా మనుగడ సాగిస్తాయి? కొత్త విద్యాసంవత్సరంలో విద్యార్థులకు అడ్మిషన్లు ఎలా ఇస్తాయి?’ అని హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది. ఈ అంశంపై స్పష్టత ఇచ్చేందుకు ప్రభుత్వం రెండు వారాల గడువు కోరగా అందుకు హైకోర్టు నిరాకరించింది. మే 4వ తేదీన తాము ఆదేశాలు జారీ చేస్తే ఇప్పటి వరకు కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించింది. పాత బకాయిలను ఎప్పటిలోగా చెల్లిస్తారన్న దాంతోపాటు, కొత్తగా ప్రభుత్వం అమలు చేయతలపెట్టిన ‘నేరుగా విద్యార్థి ఖాతాలో ఫీజు జమ చేసే విధానం’పై కూడా గురువారం స్పష్టత ఇవ్వాలని పేర్కొంది.
కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని, విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేయరాదని పేర్కొంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 7పై స్టే విధించాలని కోరుతూ 89 ప్రైవేటు ఇంజినీరింగ్ తదితర కాలేజీలు హైకోర్టులో గతంలో పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై విచారణ చేపట్టిన హైకోర్టు ప్రైవేటు కాలేజీలు నేరుగా విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకోవచ్చంటూ ఇప్పటికే మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. జీవో 7పై స్టే కూడా విధించింది. కాగా బుధవారం ఈ పిటిషన్లు మరోసారి జస్టిస్ శ్రీదేవి ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చాయి. ప్రైవేటు కాలేజీల తరఫున న్యాయవాదులు ఎల్ రవిచందర్, సుబ్రమణ్యం శ్రీరాం, తరుణ్ జీ రెడ్డి, సాహిల్‌రెడ్డి వాదనలు వినిపించారు. విద్యార్థుల నుంచి నేరుగా ఫీజులు వసూలు చేసుకోవచ్చని హైకోర్టు మధ్యంతర ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా, ఫీజులు వసూలు చేయవద్దంటూ ప్రభుత్వం కొత్తగా జీవో నెంబర్ 9ని జారీ చేసిందని తెలిపారు. ఇది కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమేనన్నారు. కొత్తగా అడ్మిషన్లు పొందుతున్న విద్యార్థులకు ప్రభుత్వం అలాట్‌మెంట్ లెటర్స్ జారీ చేస్తోందని.. అందులో విద్యార్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంటోందని గుర్తు చేశారు. ప్రభుత్వ న్యాయవాది.. కౌంటర్ దాఖలుకు ప్రభుత్వానికి రెండువారాల గడువు ఇవ్వాలని కోరారు. దీనికి నిరాకరించిన ధర్మాసనం.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినా ప్రభుత్వం మళ్లీ కొత్త జీవోలు ఎలా ఇస్తుందని ప్రశ్నించింది. విచారణను గురువారానికి వాయిదా వేసింది.