సిగ్గు లేని హైడ్రా
ABN , Publish Date - May 31 , 2026 | 06:11 AM
హైడ్రా సిగ్గు లేకుండా వ్యవహరిస్తోందని హైకోర్టు మండిపడింది. నిబంధనల ప్రకారమే నడుచుకుంటామని న్యాయస్థానానికి హామీ ఇవ్వడం ద్వారా బతికిబట్టకట్టిన హైడ్రా..
ఇష్టారీతిన వ్యవహరిస్తోంది
నిబంధనలకు కట్టుబడి ఉంటామని మాకు హామీ ఇచ్చి బతికి బట్ట కట్టింది
కానీ, వైఖరి మారటం లేదు.. పదే పదే చెప్పినా కూడా అదే తీరు
న్యాయస్థానం గౌరవాన్ని తగ్గిస్తోంది..
ఓ భూవివాదం-కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
హైదరాబాద్, మే 30 (ఆంధ్రజ్యోతి): హైడ్రా సిగ్గు లేకుండా వ్యవహరిస్తోందని హైకోర్టు మండిపడింది. నిబంధనల ప్రకారమే నడుచుకుంటామని న్యాయస్థానానికి హామీ ఇవ్వడం ద్వారా బతికిబట్టకట్టిన హైడ్రా.. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని పేర్కొంది. ‘మొదట కూల్చెయ్.. తర్వాత కంచె వేసి బోర్డు పెట్టు.. ఆ తర్వాత చేసిన పనిని సమర్థించుకోవడానికి ప్రయత్నం చెయ్.. హైకోర్టులో వ్యతిరేకమైన తీర్పులు వస్తే వాటిని అమలు చేయకుండా తప్పించుకో’.. ఈ పద్ధతిని హైడ్రా ఎంచుకుందని ఆక్షేపించింది. హైడ్రా ఇలా ప్రవర్తించడం ఇదే తొలిసారి కాదని, పదే పదే చెప్పినా వైఖరి మార్చుకోవటం లేదని తెలిపింది. ఓ భూవివాదానికి సంబంధించిన కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఎన్‌వీఎన్ కన్‌స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్ నవీన్‌కుమార్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. మేడ్చల్ జిల్లా కూకట్‌పల్లి గ్రామ పరిధిలోని సర్వే నెంబర్లు 1003 నుంచి 1006 వరకు ఉన్న 13 ఎకరాల 17 గుంటల భూమిని 2008లో జీవో నెంబర్ 469 ద్వారా రూ.9.27 కోట్ల మొత్తానికి నాటి ప్రభుత్వం తమకు రెగ్యులరైజ్ చేసిందని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ తర్వాత ప్రభుత్వమే స్వయంగా పంచనామా చేసి పొజిషన్ అప్పగించిందని, దీనిపై తమకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చిందని తెలిపారు. అయినా ఇక్కడ ఏదులకుంట అనే జలాశయం ఉందనే కారణంతో హైడ్రా కూల్చివేతలు చేపడుతోందని వెల్లడించారు.
కూల్చివేతలపై మీడియా ప్రదర్శనలా!
ఈ పిటిషన్‌పై జస్టిస్ నగేశ్ భీమపాక విచారణ చేపట్టారు. సదరు 13 ఎకరాల 17 గుంటల భూమిలో ఎలాంటి కూల్చివేతలు చేపట్టరాదని ఈ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అందిన తర్వాత కూడా రాత్రిపూట కూల్చివేతలు జరిపారని, పెద్దఎత్తున బలగాలు, భారీ యంత్రాలతో యుద్ధానికి వెళ్లినట్లు హైడ్రా అక్కడికి వెళ్లిందని న్యాయమూర్తి పేర్కొన్నారు. వాటిని ఒక సంబరంలాగా మీడియా ఎదుట ప్రదర్శించారని, న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను ధిక్కరించి.. హైడ్రా తన ఇష్టానుసారం ప్రవర్తిస్తోందన్నారు. ఈ పనితీరు ద్వారా హైడ్రా.. చట్టబద్ధ పాలన అనే ప్రాథమిక సూత్రం మూలాలను దెబ్బతీస్తూ, హైకోర్టు అధికారాన్ని, గౌరవమర్యాదలను తగ్గిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దీనిని ఈ కోర్టు సహించదు. హైడ్రా వ్యవహరించిన తీరుపట్ల తీవ్రమైన నిరసనను ఈ కోర్టు రికార్డు చేస్తోంది. ప్రస్తుత కేసులోని భూమిలో పునరుద్ధరణ పనులు చేపట్టాలని ఆదేశాలు ఇవ్వడం సమర్థనీయమే కాదు.. ఈ కోర్టుకు అది తప్పనిసరిగా మారింది’ అని స్పష్టం చేశారు.
పునరుద్ధరణ వ్యయం అధికారుల నుంచి!
సదరు 13 ఎకరాల 17 గుంటల భూమిలో ఈ నెల 25వ తేదీ నాటికి ఉన్న స్థితిని అలాగే పునరుద్ధరించాలని, ఈ మేరకు చర్యలు చేపట్టాలని హైడ్రాకు ఆదేశాలు జారీ చేశారు. సెక్యూరిటీ గదుల వద్ద నుంచి ఎంట్రీ గేటు, విద్యుత్ లైన్లు, లైటింగ్, మౌలిక సదుపాయాలు సహా అక్కడ కూల్చిన ప్రతి దాన్నీ పునరుద్ధరించాలని స్పష్టం చేశారు. ఆ స్థలం వద్ద హైడ్రా ఏర్పాటు చేసిన కంచెను, బోర్డులను తొలగించాలన్నారు. 24 గంటల్లో హైడ్రా పునరుద్ధరణ పనులు చేపట్టకపోతే, పిటిషనర్ సొంతంగా ఆ పనులు చేసుకోవచ్చని తెలిపారు. ఆ వ్యయం మొత్తం.. ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న మునిసిపల్‌శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, రెవెన్యూ ముఖ్యకార్యదర్శి లోకేశ్‌కుమార్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, జిల్లా కలెక్టర్, స్థానిక తహసీల్దార్ తమ వ్యక్తిగత నిధుల నుంచి చెల్లించాల్సి ఉంటుందని ఆదేశాలు జారీ చేశారు. కాగా ఈ తీర్పుపై హైకోర్టు డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేస్తామని హైడ్రా శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది.
నిందితుల తల్లిదండ్రుల అక్రమ నిర్బంధం!
వారిని కోర్టులో ప్రవేశపెట్టాలి.. న్యాయవాది హత్య కేసులో పిటిషన్
ఇటీవల దారుణ హత్యకు గురైన న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ కేసులో నిందితులుగా ఉన్న హసన్ అలీ, మునీరుద్దీన్ తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని పేర్కొంటూ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది. అక్రమంగా నిర్బంధించిన నిందితుల కుటుంబ సభ్యులను కోర్టులో ప్రవేశపెట్టేలా పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ కోరారు. అమాయకులను పోలీసులు నిర్బంధించి చిత్రహింసలకు గురిచేస్తున్నారని, ఇది ప్రాథమిక హక్కులకు విరుద్ధమని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌లో వాదనలు విన్న హైకోర్టు.. ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకుండా విచారణను జూన్ 4వ తేదీకి వాయిదా వేసింది.