సీబీఐ తప్పుడు కేసు పెట్టడం హక్కుల ఉల్లంఘనే
ABN , Publish Date - Apr 28 , 2026 | 06:49 AM
ఒక ఉద్యోగి పదవీ విరమణ చేశాక సీబీఐ ఆయనపై తప్పుడు కేసును నమోదు చేయడం హక్కుల ఉల్లంఘనేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వానికి రూ.50 వేలు జరిమానా విధించింది.
రిటైర్డు ఉద్యోగికి హైకోర్టు ఊరట
కేంద్రానికి రూ.50 వేలు జరిమానా
హైదరాబాద్, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): ఒక ఉద్యోగి పదవీ విరమణ చేశాక సీబీఐ ఆయనపై తప్పుడు కేసును నమోదు చేయడం హక్కుల ఉల్లంఘనేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వానికి రూ.50 వేలు జరిమానా విధించింది. దానిని ఆ ఉద్యోగికి చెల్లించాలని ఆదేశించింది. 2009 జనవరి 31న పదవీ విరమణ చేసిన ఉద్యోగిపై అదే ఏడాది మార్చిలో తయారైన మందుల నాణ్యత విషయంలో ఎలా కేసు పెడుతారని ప్రశ్నిస్తూ దానిని కొట్టివేసింది. ఈమేరకు న్యాయమూర్తి జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ తీర్పు చెప్పారు. సికింద్రాబాద్ లాలాగూడలోని రైల్వే సెంట్రల్ ఆస్పత్రిలో రాక్సీత్రోమైసిన్ ట్యాబ్‌లెట్స్ శాంపిల్స్‌ను 2010 మే నెలలో సీబీఐ సేకరించింది. పరీక్షల్లో అవి ప్రమాణాల మేరకు లేవని తేలడంతో కేంద్ర ఔషధ నియంత్రణ మండలి కేసు పెట్టింది. హిందూస్థాన్ యాంటిబయోటిక్స్ జోనల్ మేనేజర్ ఏకే గుప్తాను ప్రధాన నిందితుడిగా చేర్చింది. మందుల శాంపిల్స్ సేకరణ సమయానికి తాను రిటైర్ అయ్యానని, నాంపల్లి కోర్టులోని క్రిమినల్ కేసును కొట్టేయాలని గుప్తా పిటిషన్ దాఖలు చేశారు. మందుల తయారీలో పిటిషనర్ పాత్ర లేదని, మందుల సరఫరా సమయంలోగాని, సీబీఐ మందులను సేకరించిన సమయంలోగాని విధుల్లో లేనందున ఆయనపై కేసు చెల్లదని న్యాయమూర్తి తేల్చారు.