Share News

రాజేంద్రనగర్‌ ఆర్డీవోకు జైలుశిక్ష

ABN , Publish Date - Apr 19 , 2026 | 05:59 AM

రాజేంద్రనగర్‌ ఆర్డీవో వెంకట్‌రెడ్డి.. ఓ కేసులో కోర్టు ఉత్తర్వులను అమలు చేయకుండా ధిక్కరించినందుకు హైకోర్టు ఆయనకు నెల రోజుల జైలుశిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది.

రాజేంద్రనగర్‌ ఆర్డీవోకు జైలుశిక్ష

  • కోర్టు ధిక్కరణ కేసులో నెల రోజుల జైలు, రూ.2 వేల జరిమానా విధించిన హైకోర్టు

  • అప్పీలుకు వెళ్లేందుకు రెండు వారాల చాన్స్‌

రాజేంద్రనగర్‌, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): రాజేంద్రనగర్‌ ఆర్డీవో వెంకట్‌రెడ్డి.. ఓ కేసులో కోర్టు ఉత్తర్వులను అమలు చేయకుండా ధిక్కరించినందుకు హైకోర్టు ఆయనకు నెల రోజుల జైలుశిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. అప్పీలుకు వెళ్లేందుకు వీలుగా తీర్పు అమలును రెండు వారాలు నిలిపివేస్తున్నట్లు తెలిపింది. వివరాల్లోకి వెళ్తే.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం పెద్ద షాపూర్‌లోని 74.97 ఎకరాల భూమి వివాదంలో ఉంది. ఆ భూమికి యజమాని హైదరాబాద్‌ నగరానికి చెందిన నవాబ్‌ మహ్మద్‌ యూసుఫుద్దీన్‌ఖాన్‌ అని హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. అయితే సదరు భూమి సీలింగ్‌ భూమి కావడంతో.. అది ప్రభుత్వ భూమి అనే అంశంపై రాజేంద్రనగర్‌ ఆర్డీవో కార్యాలయంలో కేసు నడుస్తోంది. అది సీలింగ్‌ భూమి అని, ప్రభుత్వానిదని ఆర్డీవో సూచించారు. ఆ భూమి తమదేనని, తమ పేరిట రికార్డుల్లోకి ఎక్కించాలని హైకోర్టు చెప్పినా.. ఆర్డీవో వినిపించుకోవడం లేదంటూ యూసుఫుద్దీన్‌ కోర్టు ధిక్కరణ కేసు వేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఆర్డీవోకు కోర్టు ధిక్కరణ కింద నెల రోజుల జైలుశిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయమై ఆర్డీవో వెంకట్‌రెడ్డిని ‘ఆంధ్రజ్యోతి’ వాట్సాప్‌ ద్వారా సంప్రదించగా.. ఇది సాధారణమేనని, ప్రభుత్వ భూములను కాపాడాలంటే ఇలాంటివి తప్పదని సమాధానమిచ్చారు.

Updated Date - Apr 19 , 2026 | 06:00 AM