నిషేధిత జాబితాలో చేర్చిన ఉత్తర్వుల సస్పెన్షన్
ABN , Publish Date - Jun 17 , 2026 | 05:05 AM
హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అభినందన్ కుమార్ షావిలి, ఆయన సోదరుడు అశోక్ కుమార్ షావిలికి హైకోర్టులో ఊరట లభించింది.
విశ్రాంత జడ్జి కేసులో హైకోర్టు ఉత్తర్వులు
కౌంటర్ దాఖలుకు ప్రభుత్వానికి ఆదేశాలు
హైదరాబాద్, జూన్ 16 (ఆంధ్రజ్యోతి) : హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అభినందన్ కుమార్ షావిలి, ఆయన సోదరుడు అశోక్ కుమార్ షావిలికి హైకోర్టులో ఊరట లభించింది. శంషాబాద్ మండలంలో వారికి చెందిన భూములను నిషేధిత జాబితాలో చేరుస్తూ 2025 నవంబరు 6న రంగారెడ్డి జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు సస్పెన్షన్ విధించింది. ఆ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని పేర్కొంటూ.. మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది. ఈ మేరకు ఈ వివాదంలో కౌంటర్ దాఖలు చేయాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ముఖ్య కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, రంగారెడ్డి అదనపు కలెక్టర్, శంషాబాద్ తహసీల్దార్, ఆర్డీవో, సీసీఎల్‌ఏ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ కం ఇన్‌స్పెక్టర్ జనరల్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ జూన్ 30కి వాయిదా వేసింది. తాను, తన సోదరుడికి చెందిన భూములను అధికారులు రిజిస్ట్రేషన్ యాక్ట్ - 1908 సెక్షన్ 22-ఏ (నిషేధిత జాబితా)లో చేర్చడంపై జస్టిస్ అభినందన్‌కుమార్ షావిలి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం గుబ్బడిలోని సర్వే నం.103/45ఏఏ లో తనకున్న 3.26 ఎకరాలు, సర్వే నం.103/45ఈ లో తన సోదరుడు అశోక్‌కుమార్ షావిలికి ఉన్న 1.04 ఎకరాలను నిషేధిత జాబితాలో చేరుస్తూ రంగారెడ్డి కలెక్టర్ 2025లో ఉత్తర్వులు ఇవ్వడం చెల్లదని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపట్టిన జస్టిస్ పుల్లా కార్తీక్ ధర్మాసనం.. కలెక్టర్ ఉత్తర్వులపై మధ్యంతర సస్పెన్షన్ విధించింది. ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.