ప్రదీప్ కన్‌స్ట్రక్షన్స్ భవనంపై చర్యలు వద్దు
ABN , Publish Date - Jul 16 , 2026 | 06:10 AM
హుస్సేన్‌సాగర్ ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ‘బ్లిస్ ప్రాజెక్టు’ పేరిట 17 అంతస్థుల భవనం నిర్మించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రదీప్ కన్‌స్ట్రక్షన్స్‌కు హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది.
ఈ నెల 23 దాకా ఆగండి
జీహెచ్‌ఎంసీ షోకాజ్ నోటీసులపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
హైదరాబాద్, జూలై 15 (ఆంధ్రజ్యోతి): హుస్సేన్‌సాగర్ ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ‘బ్లిస్ ప్రాజెక్టు’ పేరిట 17 అంతస్థుల భవనం నిర్మించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రదీప్ కన్‌స్ట్రక్షన్స్‌కు హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. సోమాజిగూడ రాజ్‌భవన్‌రోడ్డు సర్వే నెంబర్ 22లో ఉన్న సదరు భవనంపై ఈనెల 23 వరకు ఎలాంటి చర్యలు తీసుకోరాదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ, హైడ్రా తదితరులకు నోటీసులు జారీ చేసింది. హుస్సేన్‌సాగర్ ఎఫ్‌టీఎల్(ఫుల్ ట్యాంక్ లెవల్)లో నిర్మాణం చేపట్టారంటూ జీహెచ్‌ఎంసీ ఈ నెల 7న ప్రదీప్ కన్‌స్ట్రక్షన్స్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఈ నోటీసును సస్పెండ్ చేయాలని కోరుతూ ప్రదీప్ కన్‌స్ట్రక్షన్స్ మేనేజింగ్ పార్టనర్ బీ ప్రదీప్ రెడ్డి, మరికొందరు కొనుగోలుదారులు హైకోర్టును వేర్వేరుగా ఆశ్రయించారు. జస్టిస్ పుల్ల కార్తీక్ ధర్మాసనం ఈ పిటిషన్‌లపై బుధవారం విచారణ చేపట్టింది. ప్రదీప్ కన్‌స్ట్రక్షన్ తరఫున సీనియర్ న్యాయవాది పీఎస్ రఘురాం వాదనలు వినిపిస్తూ.. హుస్సేన్‌సాగర్ డ్రాఫ్ట్ ఎఫ్‌టీఎల్ ప్రకారం పిటిషనర్ భవనం ఎఫ్‌టీఎల్‌లో ఉందని పేర్కొనడం సరికాదన్నారు. ఎఫ్‌టీఎల్‌పై ప్రాథమిక, తుది నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిర్మాణం ఎఫ్‌టీఎల్‌లో ఉందని ఎలా ఆరోపిస్తారని ప్రశ్నించారు. అన్ని పత్రాలు పరిశీలించి 2018లో నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేశారని, పనుల పూర్తయిన తర్వాత 2026లో ఇప్పుడు అభ్యంతరం వ్యక్తం చేయడం ఏంటని, అప్పుడు ఎలా అనుమతులు ఇచ్చారని ప్రశ్నించారు. హుస్సేన్‌సాగర్ ఎఫ్‌టీఎల్ 1,440 ఎకరాలు ఉందని, ఆ తర్వాత 30 మీటర్లు బఫర్‌జోన్ ఉందని.. ఎవరికీ నోటీసు ఇవ్వకుండానే ఎక్స్‌పార్టీ ఎంక్వైరీ ఎలా చేస్తారని ప్రశ్నించారు.
ఈ దశలో హైడ్రా తరఫు న్యాయవాది జోక్యం చేసుకొని తమకు పిటిషన్ కాపీ అందలేదని.. గురువారం విచారణ చేపట్టాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. పిటిషన్ కాపీ అందజేసినట్లు హైడ్రా తరఫు న్యాయవాది సంతకం ఉందని ధర్మాసనం పేర్కొనగా తమకు ప్రతులు అందలేదని గురువారం విచారణ చేపట్టాలని కోరారు. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది పీఎస్ రఘురాం వాదిస్తూ.. నోటీసు ఇచ్చింది జీహెచ్‌ఎంసీ అయితే హైడ్రాకు ఏం సంబంధమని ప్రశ్నించారు. జీహెచ్‌ఎంసీ కంటే హైడ్రానే అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్‌రెడ్డి వాదిస్తూ.. ఈ పిటిషన్‌ను వారం రోజుల తర్వాత విచారించాలని.. ఆలోగా ప్రభుత్వం తరఫున సంక్షిప్త ప్రత్యుత్తరం దాఖలు చేస్తామని పేర్కొన్నారు.