TS High Court: సెర్చ్ వారంట్ జారీచేసే అధికారం పోలీసులకు ఎక్కడిది?
ABN , Publish Date - Jan 04 , 2026 | 05:18 AM
సెర్చ్ వారంట్ జారీచేసే అఽధికారం పోలీసులకు ఎక్కడిదని హైకోర్టు ప్రశ్నించింది. జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌లకు ఉండే అధికారాలను పోలీసులు తమ చేతుల్లోకి తీసుకోవచ్చా....
అది కోర్టుల పరిధిలోది కదా?.. హైకోర్టు ప్రశ్న
ఆధారాలు సమర్పించాలని ఆదేశం
హైదరాబాద్, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): సెర్చ్ వారంట్ జారీచేసే అఽధికారం పోలీసులకు ఎక్కడిదని హైకోర్టు ప్రశ్నించింది. జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌లకు ఉండే అధికారాలను పోలీసులు తమ చేతుల్లోకి తీసుకోవచ్చా? అని అడిగింది. దీనిపై పూర్తిస్థాయిలో వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. పోలీసు అసిస్టెంట్ కమిషనర్, కమిషనర్ స్థాయి అధికారులు తమంతట తాముగా సెర్చ్ వారంట్లు జారీ చేస్తుండటాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ విజయ్‌గోపాల్ వ్యక్తిగత హోదాలో వాదనలు వినిపిస్తూ.. సీఆర్పీసీ సెక్షన్ 93, హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ సెక్షన్ 47ను పోలీసులు దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు. జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌లకు ఉండే అధికారాలను వినియోగిస్తూ చుట్టుముట్టి తనిఖీలు (కార్డన్ అండ్ సెర్చ్) చేపడుతున్నారని తెలిపారు. నేరస్థులు, అక్రమ వలసదారుల కోసం అంటూ సెర్చ్ వారంట్ లేకుండానే ఇళ్లలోకి ప్రవేశించడంతోపాటు గుర్తింపు పత్రాలు అడుగుతున్నట్లు ఆరోపించారు. వాదనలు విన్న ధర్మాసనం.. సీఆర్పీసీ/బీఎన్‌ఎ్‌సఎ్‌స లోని ఏ నిబంధనలు, జీవోల ప్రకారం పోలీసులు సెర్చ్ వారంట్లు జారీచేస్తున్నారో పూర్తిస్థాయి వివరణ ఇవ్వాలని పేర్కొంది. ప్రజాభద్రతను కాపాడే విషయంలో పోలీసులు చేస్తున్న కృషిని అభినందించాల్సిందేనని, అయితే సెర్చ్ వారంట్లు జారీచేసే అధికారంపై ఉందా? అనే అంశంపై ఆధారాలతో సహా వివరణ సమర్పించాలని పేర్కొంది. తదుపరి విచారణను రెండువారాలకు వాయిదా వేసింది.