అమీన్‌పూర్ తండాలో కూల్చివేతలపై స్టేటస్ కో
ABN , Publish Date - Apr 12 , 2026 | 04:36 AM
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం ఐలాపూర్ తండాలోని సర్వే నెంబర్ 119లో ఇతర శాఖల అధికారుల సాయంతో హైడ్రా చేపడుతున్న కూల్చివేతలపై హైకోర్టు స్టేటస్ కో....
హైడ్రా, ఇతర శాఖలకు హైకోర్టు ఆదేశాలు
హైదరాబాద్, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం ఐలాపూర్ తండాలోని సర్వే నెంబర్ 119లో ఇతర శాఖల అధికారుల సాయంతో హైడ్రా చేపడుతున్న కూల్చివేతలపై హైకోర్టు స్టేటస్ కో(యథాతథ స్థితి) విధించింది. తదుపరి విచారణ జరిగే వరకు సంబంధిత స్థలంలోని నిర్మాణాల విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలని హైడ్రాతోపాటు ఇతర శాఖలను ఆదేశి స్తూ శనివారం మధ్యంతర ఉత్తర్వులుజారీ చేసింది. కాగా, ఎలాంటి నోటీసులివ్వకుండా వారాంతమైన శనివారం రోజున అక్రమంగా అమీన్‌పూర్‌లో కూల్చివేతలు చేపడుతున్నారంటూ గజ్జ రంగారావు మరో 11మంది హైకోర్టులో హౌజ్‌మోషన్ పిటిషన్ దాఖ లు చేశారు. దీనిపై జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది ఆర్. చంద్రశేఖర్‌రెడ్డి వాదనలు వినిపించారు. దాదాపు 2వేల మంది సిబ్బంది, జేసీబీలు, బుల్డోజర్లు, భారీ యంత్రాలతో హైడ్రా కూల్చివేతలు చేపడుతోందని తెలిపారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పిటిషనర్లను వారి ఇళ్లనుంచి బయటకు గెం టేశారని చెప్పారు. హైడ్రా తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. సర్వేనెంబర్ 119లో ఎక్కువ భాగం ఖాళీస్థలం మాత్రమే ఉందని.. చట్టవిరుద్ధంగా ఎలాంటి నిర్మాణాలను కూల్చడంలేదని పేర్కొన్నారు. ఓ కేసులో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేయడానికి రెవెన్యూశాఖ సూచనల మేరకు సదరు స్థలం రక్షణ చర్యలు చేపట్టినట్టు తెలిపారు. సర్వే నెంబర్ 119, 121లో విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని దాఖలైన పిటిషన్లను, వాటిపై దాఖలైన అప్పీళ్లను ఇదే హైకోర్టు కొట్టేసిన విషయాన్ని గమనించాలని కోరారు. పిటిషనర్లకు ఎలాంటి టైటిల్ లేదనే విష యం దానిద్వారా స్పష్టమవుతోందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సదరు భూమిని రెవెన్యూ శాఖ సూచనల ప్రకారం రక్షించి, కంచె వేయడంవరకే తమ బాధ్యత అని పేర్కొన్నారు. హోంశాఖ తరఫున న్యాయవాది వాదిస్తూ.. హైడ్రా విజ్ఞప్తి మేరకే పోలీసు రక్షణ అందిస్తున్నామని, ఇందులో తమపాత్ర ఏమీ లేదన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. వచ్చే విచారణవరకు సర్వే నెంబ ర్ 119లో నిర్మాణాల విషయంలో యథాతథ స్థితి కొనసాగించాలని హైడ్రాకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ 27కు వాయిదా పడింది.
హైడ్రా చర్యలకు హైకోర్టు మద్దతు
తండాలోని నిర్మాణాలపై మాత్రమే స్టే
ఆదివారం పనిని మళ్లీ ప్రారంభిస్తాం: హైడ్రా
మీన్‌పూర్ మండలంలో శనివారం హైడ్రా చేపట్టిన చర్యలకు హైకోర్టు మద్దతు తెలిపిందని హైడ్రా అధికారులు వెల్లడించారు. ఐలాపూర్ తండాలోని సర్వే నంబరు 119లో ఇప్పటికే ఉన్న నిర్మాణాల విషయంలో మాత్రమే కోర్టు యథాతథ స్థితిని కొనసాగించిందని స్పష్టం చేశారు. అయినా.. తండాలోని ఏ నిర్మాణాలనూ తాము కూల్చివేయడం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ/ వివాదాస్పద భూమికి కంచె వేసి భద్రపరచుకోవడానికి కోర్టు తమకు అనుమతి ఇచ్చిందని, కంచె వేసే పనిని ఇకపైనా కొనసాగిస్తామని ప్రకటించారు. సిబ్బంది అలిసిపోయినందున శనివారం రాత్రికి విరామం ఇచ్చి, ఆదివారం ఉదయం 6 గంటల నుంచి పనిని తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు.