క్రికెట్ ప్రైవేటు వ్యవహారం కాదు
ABN , Publish Date - Apr 25 , 2026 | 07:22 AM
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో ఆర్థిక అవకతవకల విషయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో క్రికెట్ నిర్వహణను కేవలం ఒక ప్రైవేటు వ్యవహారంగా చూడలేమని పేర్కొంది.
హెచ్‌సీఏ అవకతవకలపై స్వతంత్ర దర్యాప్తు జరగాలి
సీబీసీఐడీ ఆధ్వర్యంలో సిట్‌ను ఏర్పాటు చేయాలి: హైకోర్టు
హెచ్‌సీఏ పర్యవేక్షణకు జస్టిస్ నవీన్‌రావు కమిటీ ఏర్పాటు
హైదరాబాద్, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో ఆర్థిక అవకతవకల విషయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో క్రికెట్ నిర్వహణను కేవలం ఒక ప్రైవేటు వ్యవహారంగా చూడలేమని పేర్కొంది. ఇందులో ప్రజా ప్రయోజనం, ఆటగాళ్ల అవకాశాలు, ఆర్థిక లావాదేవీలు, జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వంటి అంశాలు ముడిపడి ఉంటాయని తెలిపింది. ఈ నేపథ్యంలో హెచ్‌సీఏలో గత కొన్నేళ్లుగా సాగుతున్న అవకతవకలు, ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు అవసరమని అభిప్రాయపడింది. ఈ మేరకు శుక్రవారం జస్టిస్ నగేశ్ భీమపాక తీర్పును వెలువరించారు. హెచ్‌సీఏలో పరిపాలన, నిర్వహణ, ఆర్థిక వ్యవహారాలపై సమగ్ర విచారణ కోసం సీబీసీఐడీ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృదాన్ని (సిట్) ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీనికి ఐపీఎస్ హోదాలోని అదనపు కమిషనర్ నేతృత్వం వహించాలన్నారు. ఆర్థిక అవకతవకలు, పరిపాలనా లోపాలపై గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టు నియమించిన పలు కమిటీలు నివేదికలు సమర్పించాయని, వాటిలో లోపాలు స్పష్టంగా వెల్లడయ్యాయని పేర్కొంది. అయినప్పటికీ సమస్యలకు తుది పరిష్కారం కనిపించకపోవడంతో ఈ దర్యాప్తు అవసరమయిందని తెలిపారు. సఫిల్‌గూడ క్రికెట్ క్లబ్ దాఖలు చేసిన పిటిషన్‌లో హెచ్‌సీఏను బీసీసీఐ స్వాధీనం చేసుకోవాలని, సీబీఐ దర్యాప్తు జరపాలని, 2025 సమావేశాన్ని రద్దు చేయాలని కోరిన విషయం విచారణకు వచ్చింది. అయితే ప్రస్తుతం సిట్ దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో హెచ్‌సీఏ పరిపాలనను బీసీసీఐకి అప్పగించాల్సిన అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది. భవిష్యత్తులో పరిస్థితులను బట్టి ఈ అంశాన్ని పరిశీలించవచ్చని పేర్కొంది. ఇక హెచ్‌సీఏ వ్యవహారాల పర్యవేక్షణ కోసం మాజీ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావును ఏకసభ్య కమిటీగా నియమిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. క్రికెట్ లీగ్ మ్యాచ్‌లు, ఆటగాళ్ల ఎంపిక, కోచ్‌లు, సెలెక్టర్లు, సిబ్బంది నియామకం, వేతనాలు వంటి అన్ని అంశాలపై ఈ కమిటీకి పూర్తి అధికారం ఉంటుందని పేర్కొంది. దర్యాప్తు పూర్తయ్యే వరకు అపెక్స్ కౌన్సిల్ ఈ కమిటీ పర్యవేక్షణలో పనిచేయాలని ఆదేశించింది. సిట్ దర్యాప్తు కోసం హెచ్‌సీఏకు సంబంధించిన అన్ని రికార్డులు, పూర్వ కమిటీలు సమర్పించిన నివేదికలు సహా అవసరమైన సమాచారాన్ని అందజేయాలని రాష్ట్ర సంస్థలు, అధికారులు, ఉద్యోగులను కోర్టు ఆదేశించింది.