శిశుగృహలో చిన్నారుల పరిస్థితిపై నివేదిక ఇవ్వండి
ABN , Publish Date - Jun 24 , 2026 | 05:08 AM
అక్రమ దత్తత రాకెట్ నుంచి రక్షించి నల్లగొండ శిశుగృహలో ఉంచిన చిన్నారుల పరిస్థితిపై నివేదిక సమర్పించాలని సూర్యాపేట, నల్లగొడ జిల్లాల ....
రెండు జిల్లాల లీగల్ సేవా అథారిటీలకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): అక్రమ దత్తత రాకెట్ నుంచి రక్షించి నల్లగొండ శిశుగృహలో ఉంచిన చిన్నారుల పరిస్థితిపై నివేదిక సమర్పించాలని సూర్యాపేట, నల్లగొడ జిల్లాల లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శులకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. అక్రమంగా దత్తత చేసుకున్నప్పటికీ ఓ పాపను తమకు ఇప్పించాలని కోరుతూ నల్గొండ మండలం చిన్న సూరారం గ్రామానికి చెందిన ముత్తినేని వెంకన్న దంపతులు చేస్తున్న న్యాయపోరాటంలో భాగంగా ఈ ఆదేశాలు ఇచ్చింది. వారి పిటిషన్‌ను గతంలో సింగిల్ జడ్జి కొట్టేయడంతో డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. దీనిపై చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్, జస్టిస్ మొహియుద్దీన్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. మంగళవారం విచారణకు నల్లగొండ జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కే గణేశ్ ప్రత్యక్షంగా హాజరై రికార్డులు సమర్పించారు. సోషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ సమాచారం సరిగా లేదని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో నల్లగొండ శిశుగృహలో ఉన్న చిన్నారుల పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని నల్గొండ, సూర్యాపేట జిల్లాల లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శులకు ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణను జూలై 8కి వాయిదా వేసింది.