జంతు సంక్షేమ బోర్డును వెంటనే ఏర్పాటు చేయండి
ABN , Publish Date - Jan 22 , 2026 | 05:18 AM
రాష్ట్ర జంతు సంక్షేమ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు రాష్ట్రంలో జంతు సంరక్షణ చట్టాల అమలు ఎలా జరుగుతోందన్న అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొంది.
సంరక్షణ చట్టాలు ఎలా అమలువుతున్నాయో చెప్పండి
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు
హైదరాబాద్, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర జంతు సంక్షేమ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు రాష్ట్రంలో జంతు సంరక్షణ చట్టాల అమలు ఎలా జరుగుతోందన్న అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొంది. రాష్ట్రంలో జంతు సంరక్షణ చట్టాలు సరిగా అమలు కావడం లేదని.. పెంపుడు జంతువుల దుకాణాలు, బ్రీడింగ్ సెంటర్లు, కబేళాలను తనిఖీ చేయడంతోపాటు చట్టాలు అమలయ్యేలా ఆదేశాలు జారీచేయాలని పేర్కొంటూ హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్ ఇండియా సంస్థ హైకోర్టులో పిటిషన్ చేసింది. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్‌ల ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. రాష్ట్ర జంతు సంక్షేమ బోర్డు గడువు 2022లోనే ముగిసిపోయినప్పటికీ కొత్త బోర్డును ఏర్పాటు చేయలేదని పేర్కొన్నారు. నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా విశ్రాంత జడ్జితో కమిటీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. గత ఏడాది జనవరిలో జంతు సంక్షేమ బోర్డులో అనధికార సభ్యుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానించారే తప్ప ఇప్పటివరకు ఆ ప్రక్రియ ముందుకు సాగలేదని తెలిపారు. పెంపుడు జంతువులు, బ్రీడింగ్ సెంటర్లు, కబేళాలు, ఇతర వ్యాపారాలు చట్టబద్ధంగా నిర్వహించేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. బోర్డు ఏర్పాటుపై అదనపు కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని అదనపు అడ్వొకేట్ జనరల్ ఇమ్రాన్‌ఖాన్ పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. జంతు సంక్షేమ బోర్డును వెంటనే ఏర్పాటు చేయడంతోపాటు కౌంటర్ దాఖలు చేయాలంటూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.