ఇంజాపూర్ భూములపై సీబీసీఐడీ దర్యాప్తు
ABN , Publish Date - Jul 14 , 2026 | 06:23 AM
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం ఇంజాపూర్ గ్రామపరిధిలోని సర్వే నెంబర్ 126లో ఉన్న దాదాపు 74 ఎకరాల్లో భూకబ్జా ఆరోపణలపై సీబీసీఐడీతో దర్యాప్తు జరిపించాలని డీజీపీకి హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది.
కబ్జాలు, రికార్డుల తారుమారు, అధికార దుర్వినియోగం.. అన్ని అంశాలపైనా జరపాలి
3 నెలల్లో దర్యాప్తు పూర్తి చేయాలి.. డీజీపీకి హైకోర్టు ఆదేశాలు
ఆ భూములపై ప్రభుత్వానికే పూర్తి హక్కులు
అయినా వ్యక్తులు, సంస్థలు కబ్జా చేశారు
అధికారులు అడ్డుకోకపోగా సహకరించారు
జిల్లా కలెక్టరు దాఖలు చేసిన కౌంటరు.. తప్పించుకునే ధోరణిలో ఉంది: ధర్మాసనం
హైదరాబాద్, జూలై 13 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం ఇంజాపూర్ గ్రామపరిధిలోని సర్వే నెంబర్ 126లో ఉన్న దాదాపు 74 ఎకరాల్లో భూకబ్జా ఆరోపణలపై సీబీసీఐడీతో దర్యాప్తు జరిపించాలని డీజీపీకి హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. భూకబ్జాలతోపాటు ప్రభుత్వ భూముల విక్రయాలు, రికార్డుల తారుమారు, అక్రమ లేఅవుట్లు, అధికార దుర్వినియోగం, ప్రభుత్వ భూములను రక్షించకపోవడం తదితర ఆరోపణలు కూడా ఉన్నాయని.. వీటికి సంబంధించిన ప్రభుత్వ అధికారులతోపాటు ప్రైవేటు వ్యక్తులపైనా దర్యాప్తు జరపాలని పేర్కొంది. తీర్పు కాపీ జారీ అయిన నాటి నుంచి మూడునెలల్లో దర్యాప్తు పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ భూములను కాపాడకుండా చోద్యం చూసిన తహసీల్దార్, గ్రామ పాలనాధికారి (జీపీవో) సహా సంబంధం ఉన్న ఇతర అధికారులపై చర్యలు తీసుకోవాలని.. దీనిపై నాలుగు వారాల్లో సమగ్ర నివేదిక అందజేయాలని రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఇంజాపూర్ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 126లో భారీఎత్తున అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని, స్థానిక రాజకీయ నాయకులు, అధికారులు కుమ్మక్కై వీటికి పాల్పడుతున్నారని, రికార్డులు తారుమారు చేశారని పేర్కొంటూ చంద్రమోహన్‌రెడ్డి సోమిరెడ్డి అనే న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మాసనం విచారణ చేపట్టింది. అప్పటి తుర్కయంజాల్ మునిసిపల్ కమిషనర్, తహసీల్దార్, జీపీవో అక్రమాలను ప్రోత్సహిస్తున్నారని, ఆమోదిత లేఅవుట్లను తొలగించి రికార్డులు మార్చారని, పార్కులు, బహిరంగస్థలాలకు వదిలిన ప్రాంతాలను తొలిగించారని పిటిషనర్ వాదనలు వినిపించారు. ప్రభుత్వ ఖజానాకు భారీనష్టం వాటిల్లిందని పేర్కొన్నారు.
ఆక్రమణలకు అధికార యంత్రాంగం సహకారం!
వాదనలు విన్న ధర్మాసనం.. రెవెన్యూ ముఖ్య కార్యదర్శి హాజరు కావాలని గతంలో తాము ఆదేశాలు ఇచ్చిన తర్వాతే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కౌంటర్ దాఖలు చేశారని గుర్తు చేసింది. ఈ సందర్భంగా ఈ కేసుపై కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఇంజాపూర్ సర్వే నెంబర్ 126లో ఉన్న భూమికి సంబంధించి రెవెన్యూ రికార్డులో ‘సర్కారీ’ అని, విలేజ్ మ్యాప్‌లో ‘జిలావర్‌ఖాన్ చెరువు’ అని ఉంది. దీని ప్రకారం సదరు భూమిపై పూర్తి హక్కులు ప్రభుత్వానికే ఉన్నాయి. దాదాపు 22 ఎకరాలు హుడాకు పోగా అక్కడ సబ్‌స్టేషన్, ఇందిరమ్మ కాలనీ, ఆలయాలు, డబుల్‌బెడ్రూం ఇళ్లు, జిల్లా పరిషత్ రోడ్లు, కెనాల్, దోబీఘాట్, గోడౌన్లు, షెడ్లు, కొంత వ్యవసాయ భూమి, జలాశయం ఉన్నట్లు కౌంటర్‌లో పేర్కొన్నారు. అయితే ఎవరెవరికి ఎప్పుడు, ఏ విధానంలో భూమి కేటాయించారు అనే వివరాలు ఏవీ కౌంటర్‌లో పేర్కొనలేదు. ఏ అధికారంతో ఆయా వ్యక్తులు, సంస్థలు కబ్జాలో ఉన్నారనే ప్రశ్నలకు సమాధానం లేదు. జిల్లా కలెక్టర్ దాఖలు చేసిన కౌంటర్‌ను పరిశీలిస్తే ఈ పిటిషన్ దాఖలు చేసిన పిటిషనర్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు.. కబ్జాలకు సంబంధించిన అసలు అంశాన్ని పక్కదోవపట్టించాలని చూస్తున్నట్లు స్పష్టమవుతోంది. ప్రభుత్వ భూమి ఎలా ఆక్రమణలకు గురైందనే వివరణ లేకుండా.. ఆక్రమణదారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరించకుండా తప్పించుకునే ధోరణిలో కౌంటర్ ఉంది. మొత్తంగా ప్రభుత్వ వ్యవస్థ ఆక్రమణలకు సహకరించినట్లు స్పష్టమవుతోంది’ అని ధర్మాసనం ఆక్షేపించింది.
ఖజానాకు నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకోం!
ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం జరుగుతుంటే తాము చూస్తూ ఊరుకోబోమని కోర్టు స్పష్టం చేసింది. అక్రమాలను కొనసాగన్విబోమని తెలిపింది. రెవెన్యూ అధికారులు ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కైనట్లు స్పష్టంగా తెలుస్తున్న ఇలాంటి అక్రమాలను మొగ్గలోనే తుంచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడింది. సర్వే నెంబర్ 126లో జిలావర్‌ఖాన్ చెరువు ఆక్రమణలతో సంబంధం ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తులపై సీబీసీఐడీ దర్యాప్తు చేపట్టాలని డీజీపీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.