ఎమ్మెల్యేలు పోరాడేందుకు అసెంబ్లీ ఉంది కదా!
ABN , Publish Date - Aug 06 , 2026 | 06:19 AM
కోర్టుల్లో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేసే అవకాశం ఉన్నది పేదలు, తమ గొంతు వినిపించలేని వారి కోసమని.. అంతేతప్ప శక్తివంతులు, తమ గొంతు వినిపించగల వారి కోసం కాదని హైకోర్టు స్పష్టం చేసింది.
ప్రభుత్వ విధాన నిర్ణయాలను అమలు చేయాలంటూ ఎమ్మెల్యేలు హైకోర్టుకు రావడమేంటి?
పేదలు, గొంతు లేనివారి కోసమే పిల్ అవకాశం
ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, హరీశ్‌రావులకు హైకోర్టు ప్రశ్నలు
హైదరాబాద్, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): కోర్టుల్లో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేసే అవకాశం ఉన్నది పేదలు, తమ గొంతు వినిపించలేని వారి కోసమని.. అంతేతప్ప శక్తివంతులు, తమ గొంతు వినిపించగల వారి కోసం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ నిధుల విడుదల అంశంపై ఎమ్మెల్యేలు మాట్లాడటానికి, పోరాడటానికి అసెంబ్లీ ఉందని స్పష్టం చేసింది. ప్రభుత్వ విధాన నిర్ణయం అమలు చేయాలంటూ ఎమ్మెల్యేలు హైకోర్టుకు రావడం ఏమిటని ప్రశ్నించింది. తుఫానులు, భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లింపు, రైతులకు రుణమాఫీపై ప్రభుత్వం జీవోలు ఇచ్చినా.. నిధుల విడుదలలో జాప్యం చేస్తోందంటూ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, హరీశ్‌రావు హైకోర్టులో వేర్వే రు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు (పిల్) దాఖలు చేశారు. అయితే ఈ పి టిషన్ల విచారణార్హతపై హైకోర్టు రిజిస్ట్రీ పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, విచారణ కోసం నంబర్ చేయలేదు. రిజిస్ట్రీ అభ్యంతరాలపై చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహి యుద్దీన్‌ల ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ‘‘పంటలు దెబ్బతిన్న రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, రుణమాఫీపై ప్రభుత్వం ఇప్పటికే విధాన నిర్ణయాలు తీసుకుని జీవోలు ఇచ్చింది.
వాటిని కోర్టు ద్వారా అమలు చేయించాలని మీరు భావిస్తున్నారా? మీరు స్వయంగా ఎమ్మెల్యేలు.. అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఉంది కదా? జీవోలు అమలు చేయాలని, నిధులు విడుదల చేయాలని హైకోర్టు ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు ఇవ్వాలా? నిధులు ఎప్పుడు, ఎంత ఇవ్వాలి, వాయిదాల్లో ఇస్తారా, ఏకమొత్తంగా ఇస్తారా? అన్న విషయాలను కోర్టు నియంత్రించాలని మీరు ఎలా భావిస్తున్నారు ? అన్నీ మేమే చెప్తే ఆర్థికశాఖ ఏం చేస్తుంది? మీరు ఎమ్మెల్యేలు.. ఈ సమస్యలను అసెంబ్లీలో లేవనె త్తండి. ప్రజల్లోకి వెళ్లి వారి అభిప్రాయాలు కోరండి. ఏది అనుకుంటే అది చేయగల శక్తి మీకుంది. రాజకీయ అంశాలపై మేం వ్యాఖ్యలు చేయాలనుకోవడం లేదు. ఇవన్నీ బహిరంగ సభల్లో చేయాల్సిన ప్రసంగాలకు సంబంధించినవి’’ అని ధర్మాసనం పేర్కొంది. ఈ పిటిషన్లకు రెగ్యులర్ నంబర్ ఇచ్చి విచారణ చేపట్టాలా, తిరస్కరించాలా? అన్నదానిపై ఈ నెల 14న నిర్ణయం వెలువరిస్తామని తెలిపింది.
మెట్రో రెండో దశ పనులపై స్టేకు నిరాకరణ
మెట్రోరైల్ రెండోదశలో భాగంగా ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు చేపడుతున్న పనులపై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. ఆ మార్గంలో జరుగుతున్న పనులను పరిశీలించి వారసత్వ, చారిత్రక కట్టడా లు దెబ్బతింటున్నాయా, లేదా? అనేది తేల్చడానికి అడ్వొకేట్ కమిషనర్‌ను నియమించాలన్న విజ్ఞప్తిని తోసిపుచ్చింది. మెట్రోరైల్ నిర్మాణ పనుల వల్ల చారిత్రక, వారసత్వ కట్టడాలు దెబ్బతింటున్నాయంటూ ‘యాక్ట్ పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్’ దాఖలు చేసిన పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్‌ల ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. పనులపై స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తూ, పూర్తి వాదనలు విన్నాకే నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది.