Share News

స్పీకర్‌కు హైకోర్టు నోటీసులు

ABN , Publish Date - Mar 26 , 2026 | 04:39 AM

ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు అంశంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల పిటిషన్లపై వివరణ ఇవ్వాలంటూ శాసన సభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

స్పీకర్‌కు హైకోర్టు నోటీసులు

  • పార్టీ మారారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు కూడా..

  • బీఆర్‌ఎస్‌ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ సందర్భంగా జారీ

  • స్పీకర్‌ తీర్పును కొట్టేసి.. 9 మందిని అనర్హులుగా ప్రకటించాలని వాదన

  • పిటిషన్‌లో గూడెం మహిపాల్‌ రెడ్డిని మినహాయించిన బీఆర్‌ఎస్‌

హైదరాబాద్‌, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు అంశంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల పిటిషన్లపై వివరణ ఇవ్వాలంటూ శాసన సభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అలాగే, పార్టీ మారారంటూ బీఆర్‌ఎస్‌ ఆరోపిస్తున్న తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు కూడా నోటీసులిచ్చింది. బీఆర్‌ఎస్‌ టికెట్‌పై ఎమ్మెల్యేలుగా గెలిచి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని, ఆ ఎమ్మెల్యేలు పార్టీ మారలేదంటూ ఇటీవల స్పీకర్‌ ఇచ్చిన తీర్పును కొట్టేయాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, పోచారం శ్రీనివా్‌సరెడ్డి, టీ ప్రకాశ్‌గౌడ్‌, కాలే యాదయ్య, తెల్లం వెంకట్‌రావు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అరికెపూడి గాంధీకి వ్యతిరేకంగా వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, డాక్టర్‌ సంజయ్‌కుమార్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లు గురువారం విచారణకు రానున్నాయి. మొత్తం తొమ్మిది మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని హైకోర్టును ఆశ్రయించిన బీఆర్‌ఎస్‌.., పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డిని మాత్రం వదిలేయడం గమనార్హం. కాగా, బీఆర్‌ఎస్‌ నేతలు దాఖలు చేసిన ఏడు పిటిషన్లపై చీఫ్‌ జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్‌, జస్టిస్‌ మొహియుద్దీన్‌ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. బీఆర్‌ఎస్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది గండ్ర మోహన్‌రావు, న్యాయవాది సంతోష్‌కుమార్‌ వాదనలు వినిపించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి సమక్షంలో కాంగ్రెస్‌ కండువాలు కప్పుకోవడం ప్రపంచమంతా చూసిందన్నారు.


అన్ని రకాల ప్రసార మాధ్యమాల్లో అందుకు సంబంధించిన వార్తలు వచ్చాయని చెప్పారు. పార్టీ మారిన తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో ఆ ఎమ్మెల్యేలు బీఆర్‌ఎ్‌సకు వ్యతిరేకంగా, కాంగ్రెస్కు అనుకూలంగా ప్రచారం చేశారని వివరించారు. ఎమ్మెల్యే దానం నాగేందర్‌ కాంగ్రెస్‌ పార్టీ బీఫారంపై సికింద్రాబాద్‌ నుంచి ఎంపీగా పోటీ చేశారన్నారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివా్‌సరెడ్డికి ప్రభుత్వ సలహాదారుగా క్యాబినెట్‌ ర్యాంకు ఇచ్చారని చెప్పారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల అంశంలో బీఆర్‌ఎస్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించిందని, సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాతే స్పీకర్‌ విచారణ పూర్తి చేశారని వెల్లడించారు. స్పీకర్‌ ఇచ్చిన తీర్పులకు సంబంధించిన కాపీలను కూడా తమకు ఇవ్వట్లేదని తెలిపారు. అలాగే, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రాతినిధ్యం వహించిన ఒక సీనియర్‌ న్యాయవాదిని స్పీకర్‌ తన సలహాదారుగా పెట్టుకున్నారన్నారు. ఆయన సలహా మేరకే స్పీకర్‌ వివక్షతో కూడిన తీర్పు ఇచ్చారని ఆరోపించారు. స్పీకర్‌ తీర్పు న్యాయసమీక్షకు నిలువజాలదని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం.. వివరణ ఇవ్వాలని స్పీకర్‌కు, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు వ్యక్తిగత నోటీసులు అందజేయడానికి పిటిషనర్లకు అనుమతినిచ్చింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 16కు వాయిదా వేసింది. దానంనాగేందర్‌కు వ్యతిరేకంగా ఇప్పటికే బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌తో కలిపి అన్ని పిటిషన్లను విచారిస్తామని ధర్మాసనం తెలిపింది.

Updated Date - Mar 26 , 2026 | 04:39 AM