కడియం శ్రీహరి, సంజయ్‌కు హైకోర్టు నోటీసులు
ABN , Publish Date - Mar 27 , 2026 | 04:22 AM
ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, సంజయ్‌కుమార్‌లపై అనర్హత వేటు వేయాలని, వారికి అనుకూలంగా స్పీకర్ ఇచ్చిన తీర్పును కొట్టేయాలంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన రెండు వేర్వేరు పిటిషన్లు...
హైదరాబాద్, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, సంజయ్‌కుమార్‌లపై అనర్హత వేటు వేయాలని, వారికి అనుకూలంగా స్పీకర్ ఇచ్చిన తీర్పును కొట్టేయాలంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన రెండు వేర్వేరు పిటిషన్‌లు గురువారం హైకోర్టు డివిజన్ బెంచ్ ఎదుట విచారణకు వచ్చాయి. ఈ పిటిషన్‌లలో వివరణ ఇవ్వాలని స్పీకర్, శ్రీహరి, సంజయ్‌కు హైకోర్టు నోటీసులు జారీచేసింది. పార్టీ మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, కాలే యాదయ్య, తెల్లం వెంకట్‌రావు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అరికెపూడి గాంధీలకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ దాఖలు చేసిన పిటిషన్‌లో బుధవారమే నోటీసులు జారీ అయిన విషయం తెలిసిందే. తాజాగా కడియం శ్రీహరి, సంజయ్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌లో నోటీసులు జారీ అయ్యాయి. మొత్తం 9 మంది ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ పిటిషన్లు దాఖలు చేసింది. అన్ని పిటిషన్‌లను బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి.. దానంకు వ్యతిరేకంగా ఇప్పటికే దాఖలు చేసిన పిటిషన్‌తో కలిపి వింటామన్న ధర్మాసనం.. విచారణను ఏప్రిల్ 16కు వాయిదా వేసింది.