Share News

వాహనాలు సీజ్‌ చేసిన పోలీసులపై కోర్టు ధిక్కరణ పిటిషన్‌

ABN , Publish Date - May 02 , 2026 | 05:33 AM

పెండింగ్‌ చలాన్ల వసూళ్ల కోసం వాహనాలు సీజ్‌ చేయడం వంటి కఠిన చర్యలకు దిగరాదంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పాటించలేదని ...

వాహనాలు సీజ్‌ చేసిన పోలీసులపై కోర్టు ధిక్కరణ పిటిషన్‌

హైదరాబాద్‌, మే 1 (ఆంధ్రజ్యోతి): పెండింగ్‌ చలాన్ల వసూళ్ల కోసం వాహనాలు సీజ్‌ చేయడం వంటి కఠిన చర్యలకు దిగరాదంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పాటించలేదని ఆరోపిస్తూ పోలీసులపై కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలైంది. దీనిపై వివరణ ఇవ్వాలని పేర్కొంటూ హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, హైదరాబాద్‌ సిటీ ట్రాఫిక్‌ అడిషనల్‌ కమిషనర్‌, రవాణాశాఖ కమిషనర్‌, చిక్కడపల్లి ట్రాఫిక్‌ పోలీసులకు హైకోర్టు ధిక్కరణ నోటీసులు జారీచేసింది. ట్రాఫిక్‌ చలాన్లు పెండింగ్‌లో ఉన్నప్పటికీ వాటి వసూళ్ల కోసం వాహనదారులను ఒత్తిడి చేయరాదని, వాహనాలను సీజ్‌ చేయరాదని, చట్టప్రకారం కోర్టు ద్వారా నోటీసులు పంపాలని హైకోర్టు ఇటీవల తీర్పు ప్రకటించింది. ఈ తీర్పును ధిక్కరిస్తూ ఏప్రిల్‌ 9న కోర్టు విధులకు వెళ్తున్న తనను ఆర్టీసీ క్రాస్‌రోడ్‌ వద్ద ట్రాఫిక్‌ పోలీసులు అడ్డగించి తాళాలు లాక్కున్నారని ఆరోపిస్తూ న్యాయవాది వీ రాఘవేంద్రచారి హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. వాదనలు విన్న జస్టిస్‌ ఎన్వీ శ్రవణ్‌కుమార్‌ ధర్మాసనం.. ఈ కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని పేర్కొంటూ అధికారులకు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణ జూన్‌ 19కి వాయిదా పడింది.

Updated Date - May 02 , 2026 | 05:33 AM