Share News

హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో సుశీ ఇన్‌ఫ్రాకు దక్కని ఊరట

ABN , Publish Date - Oct 16 , 2026 | 04:23 AM

రేడియల్‌ రోడ్డు ప్యాకేజ్‌-2 పనుల టెండర్‌ వివాదంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన సుశీ ఇన్‌ఫ్రాకు హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లోనూ ఊరట లభించలేదు

హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో  సుశీ ఇన్‌ఫ్రాకు దక్కని ఊరట
tg high court

హైదరాబాద్‌, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): రేడియల్‌ రోడ్డు ప్యాకేజ్‌-2 పనుల టెండర్‌ వివాదంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన సుశీ ఇన్‌ఫ్రాకు హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లోనూ ఊరట లభించలేదు. కొత్వాల్‌గూడ (బుద్వేల్‌) నుంచి నేషనల్‌ హైవే 167ఎన్‌ (నాచారం, కోస్గి/కొడంగల్‌) వరకు 81 కిలోమీటర్ల మేర నిర్మించతలపెట్టిన రేడియల్‌ రోడ్డు టెండర్లపై ఆ సంస్థ కోర్టును ఆశ్రయించింది. తమ టెక్నికల్‌ బి డ్‌పై అనర్హత వేటు వేయడం చెల్లదంటూ తొలుత హైకోర్టు సింగిల్‌ జడ్జి వద్ద పిటిషన్‌ దాఖలు చేసింది. విజయవంతమైన బిడ్డర్‌ (ఎల్‌-1) వాదన కూడా వింటామని ఆ జడ్జి తెలిపారు. జడ్జి నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుశీ ఇన్‌ఫ్రా డివిజన్‌ బెంచ్‌లో అప్పీల్‌ దాఖలు చేసింది. ఆ అప్పీల్‌పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ శాంకోషీ, జస్టిస్‌ చలపతిరావుల ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. సింగిల్‌ జడ్జి నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని తెలిపింది. ఎల్‌-1 బిడ్డర్‌ను ఇంప్లీడ్‌ చేసి సింగిల్‌ జడ్జి వద్దే వివాదాన్ని తేల్చుకోవాలని సూచించింది.

Updated Date - Oct 16 , 2026 | 04:24 AM