ఏప్రిల్ 9 లోగా బకాయిలు చెల్లించాలి!
ABN , Publish Date - Mar 24 , 2026 | 05:17 AM
ప్రభుత్వం నుంచి రావాల్సిన పదవీ విరమణ ప్రయోజనాల బకాయిల కోసం రిట్ పిటిషన్లు, కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలు చేసిన 2600 మంది విశ్రాంత ఉద్యోగులకు..
2600 మంది విశ్రాంత ఉద్యోగుల పదవీ విరమణ ప్రయోజనాలపై సర్కారుకు హైకోర్టు ఆదేశం
బెనిఫిట్స్ తీసుకోకుండానే 86 మంది చనిపోయారని ఆవేదన
విచారణకు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి గైర్హాజరుపై ఆగ్రహం
రాత్రి ఎంతవరకైనా ఉంటామని, హాజరు కావాల్సిందేనని వెల్లడి
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన సందీప్‌కుమార్ సుల్తానియా
హైదరాబాద్, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం నుంచి రావాల్సిన పదవీ విరమణ ప్రయోజనాల బకాయిల కోసం రిట్ పిటిషన్లు, కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలు చేసిన 2600 మంది విశ్రాంత ఉద్యోగులకు.. ఏప్రిల్ 9లోగా బకాయిలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ అందుకోకుండానే 86 మంది ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు చనిపోవటంపై ఆవేదన వ్యక్తం చేసింది. జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం సోమవారం ఈ అంశంపై విచారణ చేపట్టింది. ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని పేర్కొంటూ ఫారం-1 నోటీసు జారీ చేసినప్పటికీ, హాజరుకాకపోవటం ఏమిటని న్యాయమూర్తి ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలు ఉండటంతో సందీప్‌కుమార్ రాలేదని ప్రభుత్వ న్యాయవాది తెలియజేశారు. అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయని ముందే తెలిసినప్పుడు హైకోర్టులో అప్లికేషన్ దాఖలు చేసి మినహాయింపు తీసుకోవాలి కదా? అని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఎంత రాత్రి వరకైనా కోర్టులోనే ఉంటామని.. ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి హాజరు కావాల్సిందేనని స్పష్టం చేశారు. దీంతో సాయంత్రం 4 గంటలకు సందీప్‌కుమార్ సుల్తానియా.. జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం ఎదుట వీడియోకాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. 2600 మంది విశ్రాంత ఉద్యోగులకు బకాయిలు క్లియర్ చేయాలని ధర్మాసనం ఈ సందర్భంగా స్పష్టంచేసింది. ఏప్రిల్ 9 లోగా బకాయిలు ఇవ్వకపోతే.. ఈసారి ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ప్రత్యక్షంగా హాజరుకావాల్సి ఉంటుందని తెలిపింది. ‘ఉద్యోగ విరమణ చేసిన టీచర్లు, ఇంజినీర్లు, హెడ్‌మాస్టర్లు, పోలీసులు, ఇతర శాఖల ఉద్యోగులు రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ మంజూరు చేయాలని పేర్కొంటూ 9 నెలల కిందటే పిటిషన్లు వేశారు. బకాయిలివ్వాలని ఈ కోర్టు తీర్పు ఇచ్చినా ఆదేశాలు అమలు కాలేదు. దీంతో కోర్టు ధిక్కరణ పిటిషన్లు కూడా వేశారు. కోర్టు ధిక్కరణ పిటిషన్లలో ఫారం-1 నోటీసు ఇచ్చినా మీరు బకాయిలు ఇవ్వలేదు. ఇది వాళ్లకు రావాల్సిన డబ్బు. రావాల్సిందే అడుగుతున్నారు. కేసులు నడుస్తుండగానే 86 మంది విశ్రాంత ఉద్యోగులు చనిపోయారు’ అని జస్టిస్ రాజేశ్వర్‌రావు పేర్కొన్నారు. సందీప్‌కుమార్ సుల్తానియా వివరణ ఇస్తూ మొత్తం 3,650 టోకెన్లలో ఇప్పటికే 1056 క్లియర్ చేశామని.. ఇంకా 2600 టోకెన్లు ఏప్రిల్ 31 లోగా క్లియర్ చేస్తామని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఏప్రిల్ 9 వరకు గడువు ఇస్తున్నామని.. ఆలోగా బకాయిలు చెల్లించాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు.