మున్సిపల్ వివాదాలపై ట్రైబ్యునల్ ఏర్పాటు చేయండి
ABN , Publish Date - Mar 13 , 2026 | 04:53 AM
మున్సిపల్ శాఖ పరిధిలో మంజూరు చేసే భవన నిర్మాణ అనుమతులు, కూల్చివేతలకు సంబంధించిన వివాదాలు, అక్రమ నిర్మాణాలు, భవనాలు సీజ్ చేయడం.....
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు
హైదరాబాద్, మార్చి 12(ఆంధ్రజ్యోతి): మున్సిపల్ శాఖ పరిధిలో మంజూరు చేసే భవన నిర్మాణ అనుమతులు, కూల్చివేతలకు సంబంధించిన వివాదాలు, అక్రమ నిర్మాణాలు, భవనాలు సీజ్ చేయడం, డీవియేషన్లు వంటి అంశాలపై ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో రాధేశ్యాం కన్‌స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్‌కు జీహెచ్‌ఎంసీ అధికారులు భవన నిర్మాణ అనుమతులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ జే శ్రీనివాస్ యాదవ్, డీఈ నాగరాజ్ హైకోర్టులో రిట్ అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌పై చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. మున్సిపల్ శాఖ పరిఽధిలో మంజూరు చేసే భవన నిర్మాణ అనుమతులు, కూల్చివేతలు, అక్రమ నిర్మాణాలకు సంబంధించి లెక్కకు మించి హైకోర్టుకు పిటిషన్లు వస్తున్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ట్రైబ్యునల్ ఏర్పాటు చేసేలా జీహెచ్‌ఎంసీ చట్టంలో ఇప్పటికే ప్రొవిజన్లు ఉన్నాయని వాటి ప్రకారం ప్రత్యేక నైపుణ్యం కలిగిన ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డికి ధర్మాసనం సూచించింది. ఈ విషయాన్ని ప్రభుత్వంతో ప్రత్యేకంగా చర్చించేందుకు అడ్వకేట్ జనరల్‌కు ప్రత్యేక సూచనలు చేసింది. ప్రత్యేక ట్రైబ్యునల్ ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకు వస్తే న్యాయాధికారులను కేటాయిస్తామని ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణను హైకోర్టు ఏప్రిల్ 15కు వాయిదా వేసింది.