Share News

ఎక్స్‌అఫీషియో సభ్యుల గుర్తింపులో నిబంధనలు పాటించాలి: హైకోర్టు

ABN , Publish Date - Feb 08 , 2026 | 07:12 AM

మునిసిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికల్లో ఓటింగ్‌ హక్కులు కలిగి ఉండే ఎక్స్‌అఫీషియో సభ్యులను గుర్తించే విషయంలో నిబంధనలను పాటించాలని జిల్లా కలెక్టర్లకు హైకోర్టు సూచించింది.

ఎక్స్‌అఫీషియో సభ్యుల గుర్తింపులో నిబంధనలు పాటించాలి: హైకోర్టు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికల్లో ఓటింగ్‌ హక్కులు కలిగి ఉండే ఎక్స్‌అఫీషియో సభ్యులను గుర్తించే విషయంలో నిబంధనలను పాటించాలని జిల్లా కలెక్టర్లకు హైకోర్టు సూచించింది. దీనిపై గతంలో హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ నిర్దేశించిన ప్రొసీజర్‌ను తు.చ. తప్పకుండా అనుసరించాలని తెలిపింది. ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా ఉండేందుకు ఇష్టమైన మునిసిపాలిటీని ఎంచుకోవాలని ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు నిర్మల్‌ కలెక్టర్‌ నోటీసు జారీ చేయడాన్ని సవాల్‌ చేస్తూ కత్తి నరేందర్‌ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ ఎన్వీ శ్రవణ్‌కుమార్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫున సీహెచ్‌ నరేశ్‌రెడ్డి వాదిస్తూ.. కలెక్టర్‌ నోటీసు నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. తమ నియోజవర్గం పరిధిలోని ఒక మునిసిపాలిటీకే ఎంపీ, ఎమ్మెల్యేలు ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా ఉంటారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్‌ జనరల్‌ (ఏఏజీ) తేరా రజినీకాంత్‌రెడ్డి వాదిస్తూ.. కేవలం పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా పిటిషనర్‌ కోర్టును ఆశ్రయించారని పేర్కొన్నారు. దాంతో నిబంధనలను పాటించాలని కలెక్టర్లను ఆదేశిస్తూ హైకోర్టు పిటిషన్‌ను ముగించింది.

Updated Date - Feb 08 , 2026 | 07:12 AM