Share News

TS High Court: కొత్తగూడెం కార్పొరేషన్‌పై ఇప్పుడు జోక్యం చేసుకోలేం: హైకోర్టు

ABN , Publish Date - Jan 20 , 2026 | 02:41 AM

కొత్తగూడెం మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటును అడ్డుకునేలా మధ్యంతర ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది.

TS High Court: కొత్తగూడెం కార్పొరేషన్‌పై ఇప్పుడు జోక్యం చేసుకోలేం: హైకోర్టు

హైదరాబాద్‌, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): కొత్తగూడెం మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటును అడ్డుకునేలా మధ్యంతర ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికిప్పుడు జోక్యం చేసుకోవడానికి తగిన కారణాలు ఏవీ కనిపించట్లేదని పేర్కొంది. షెడ్యూల్‌ ఏరియా గ్రామాలను కొత్తగూడెం మునిసిపల్‌ కార్పొరేషన్‌లో కలిపారనడానికి ప్రాథమికంగా ఎలాంటి ఆధారాలు కనిపించడం లేవంటూ విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. కొత్తగూడెం, పాల్వంచ మునిసిపాలిటీలను విలీనం చేసి నూతనంగా కొత్తగూడెం మునిసిపల్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయడాన్ని సవాల్‌ చేస్తూ పాల్వంచ మండలానికి చెందిన పి.ప్రవీణ్‌కుమార్‌, అజ్మీరా నరేశ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. షెడ్యూల్‌ ఏరియాల్లో ఉన్న 7 పంచాయతీలను మునిసిపల్‌ కార్పొరేషన్‌లో విలీనం చేయడం రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 243 జెడ్‌సీ (3)కి విరుద్ధమని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై చీఫ్‌ జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్‌, జస్టిస్‌ మొహియుద్దీన్‌ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. కొత్త కార్పొరేషన్‌లో విలీనం చేసిన ప్రాంతాలు 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం షెడ్యూల్‌ ఏరియాలో ఉన్నట్లు పిటిషనర్లు వివరాలు సమర్పించలేకపోయారంటూ పిటిషన్‌ను వాయిదా వేసింది.

Updated Date - Jan 20 , 2026 | 02:41 AM