వివరణ తీసుకోకుండా జైలుకు పంపిస్తారా?
ABN , Publish Date - Mar 25 , 2026 | 04:30 AM
వివరణ ఇచ్చేందుకు సరైన అవకాశం కల్పింకుండా బెయిల్ షరతులు ఉల్లంఘించారనే ఆరోపణలపై ఓ నిందితుడిని నేరుగా జైలుకు పంపించినందుకు బాలాపూర్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కం డీసీపీని హైకోర్టు తప్పుబట్టింది.
బాలాపూర్ డీసీపీని తప్పుపట్టిన హైకోర్టు
హైదరాబాద్, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): వివరణ ఇచ్చేందుకు సరైన అవకాశం కల్పింకుండా బెయిల్ షరతులు ఉల్లంఘించారనే ఆరోపణలపై ఓ నిందితుడిని నేరుగా జైలుకు పంపించినందుకు బాలాపూర్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కం డీసీపీని హైకోర్టు తప్పుబట్టింది. నిందితుడ్ని జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశాలు జారీచేసింది. బెయిల్ షరతులు ఉల్లంఘించాడన్న ఆరోపణపై సిక్కు బస్తీకి చెందిన అర్జున్‌సింగ్ అలియాస్ జోగేందర్ అలియాస్ జోగీకి బాలాపూర్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కం డీసీపీ సురేశ్‌కుమార్ ఆరు నెలల జైలు శిక్ష విధించారు. అతడిని నేరుగా సంగారెడ్డి సెంట్రల్ జైలుకు పంపారు. దీనిని సవాలు చేస్తూ నిందితుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఈవీ వేణుగోపాల్ ధర్మాసనం విచారణ చేపట్టింది. పోలీసుల తరఫు న్యాయవాది వాదిస్తూ.. గతేడాది మార్చి 10న జారీచేసిన జీవో నెంబర్ 19 ప్రకారం దఖలు పడ్డ అధికారాల ప్రకారమే డీసీపీ ఆ ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు. ఆ జీవో చట్టబద్ధతను వివరించడానికి సమయం ఇవ్వాలని కోరారు. జీవో చట్టబద్ధత మాట ఎలా ఉన్నా నిందితుడికి జైలుశిక్ష విధించడంలో సహజ న్యాయసూత్రాలను పాటించలేదని ధర్మాసనం తెలిపింది. వెంటనే విడుదల చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ 6కు వాయిదా వేసింది.