హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై హైకోర్టు ఆగ్రహం
ABN , Publish Date - Jun 10 , 2026 | 05:20 AM
కోర్టు ధిక్కరణ కేసులో ప్రత్యక్షంగా హాజరు కాకుండా నిర్లక్ష్యం వహించారంటూ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై హైకోర్టు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యక్తిగతంగా రాలేని పక్షంలో...
విచారణకు గైర్హాజరుపై అసంతృప్తి
కోర్టు ధిక్కరణ కేసులో ప్రత్యక్షంగా హాజరు కాకుండా నిర్లక్ష్యం వహించారంటూ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై హైకోర్టు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యక్తిగతంగా రాలేని పక్షంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరై వివరణ ఇచ్చే అవకాశాన్ని ఉపయోగించుకోకపోవడాన్ని ప్రశ్నించింది. మినహాయింపు కోరుతూ కనీసం అఫిడవిట్ కూడా దాఖలు చేయకపోవడం ఆయన నిర్లక్ష్యాన్ని తెలియజేస్తోందని ఘాటుగా వ్యాఖ్యానించింది. రంగనాథ్‌పై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై జస్టిస్ ఎన్.వి శ్రవణ్ కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రతి కేసులోనూ హైడ్రా బోర్డులు, కంచెలు ఏర్పాటు చేస్తోందని, భూములను పిటిషనర్లు ఎక్కడికైనా తీసుకెళ్లే అవకాశం ఉందా? అని అడిగింది. హైకోర్టు ఆదేశించిన తర్వాత కూడా 20 రోజుల వరకు బోర్డు ఎందుకు తొలగించలేదో, ఎందుకు హాజరుకాలేదో, అఫిడవిట్ సమర్పించాలని ఆదేశిస్తూ.. విచారణ మధ్యాహ్నానికి వాయిదా వేసింది. మధ్యాహ్నం హైడ్రా తరపు న్యాయవాది అఫిడవిట్ దాఖలు చేయడంతో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది. ఆ అఫిడవిట్ కూడా చాలా నిర్లక్ష్యంగా ఉందని, మరింత సమగ్రంగా దాఖలు చేయాలని అభిప్రాయపడింది. కోర్టు ఆదేశాలను విస్మరించడం రంగనాథ్ కెరీర్‌పై ప్రభావం చూపుతాయని, ఈ విషయం ఆయనకు తెలియజేయాలని న్యాయవాదికి సూచిస్తూ విచారణను వాయిదా వేసింది.