చిన్న సాయం చేసి పసిప్రాణాన్ని కాపాడుదామా..!
ABN , Publish Date - Feb 23 , 2026 | 02:25 AM
శ్రీహర్ష.. నిరుపేద కుటుంబానికి చెందిన కల్లాకపటం తెలియని మూడేళ్ల బాలుడు. లోకమంటే తెలియని ఆ చిన్నారి.. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతూ 25 రోజులుగా..
గుండె సంబంధిత సమస్యతో ఆస్పత్రిపాలైన మూడేళ్ల శ్రీహర్ష
వైద్య ఖర్చుల కోసం దాతల సాయం కోరుతున్న కుటుంబం
వైరా, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): శ్రీహర్ష.. నిరుపేద కుటుంబానికి చెందిన కల్లాకపటం తెలియని మూడేళ్ల బాలుడు. లోకమంటే తెలియని ఆ చిన్నారి.. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతూ 25 రోజులుగా ఓ ఆస్పత్రిలో ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. వైద్యానికి రూ.22.70లక్షలు అవసరం కాగా ఆ బాలుడి తండ్రి తనశక్తికి మించి ఇప్పటిదాకా రూ.9.70లక్షలు చెల్లించారు. ప్రస్తుతం నిస్సహాయ స్థితిలో ఉన్న శ్రీహర్ష తండ్రి.. తన కొడుకు ప్రాణాన్ని నిలిపేందుకు దాతలు, ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కోరుతున్నారు. ఖమ్మం జిల్లా వైరా మండలం తాటిపూడికి చెందిన కట్టా రామకృష్ణ.. సీసీ కెమెరాల మరమ్మతులు చేస్తూ, ఫొటోగ్రాఫర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రామకృష్ణ కుమారుడైన శ్రీహర్ష(3)కు ఐదారు నెలల క్రితం ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ రావడంతో సుమారు రూ.లక్షన్నరపైగా ఖర్చు చేసి చికిత్స చేయించారు. అప్పటి ఇన్‌ఫెక్షన్ శ్రీహర్ష గుండె చుట్టూ వ్యాపించిందని 25 రోజుల క్రితం వైద్యులు నిర్ధారించారు. దీంతో తల్లిదండ్రులు శ్రీహర్షను హైదరాబాద్ కూకట్‌పల్లిలోని అంకురా ఆస్పత్రిలో చేర్చి వైద్యం అందిస్తున్నారు. చిన్నారికి పూర్తిస్థాయి వైద్యం చేయాలంటే రూ.22.70లక్షలు ఖర్చవుతుందని ఆస్పత్రి యాజమాన్యం తెలపగా.. పేద కుటుంబానికి చెందిన రామకృష్ణ ఇప్పటివరకు రూ.9.70లక్షలు చెల్లించగలిగారు. మిగిలిన సొమ్ము చెల్లించడం రామకృష్ణకు భారంగా మారింది. శ్రీహర్ష పరిస్థితి ఆందోళనకరంగా ఉండగా.. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దాతలు తమ పరిస్థితిని అర్థం చేసుకుని సాయం చేసి తమ కుమారుడి ప్రాణాలు కాపాడాలని వేడుకుంటున్నారు. తమను 90107 73448 నంబర్‌లో సంప్రదించాలని రామకృష్ణ కోరారు.