ఆకాశ మార్గాన అందాల సోమశిలకు
ABN , Publish Date - Apr 04 , 2026 | 05:03 AM
ఆకాశ మార్గాన అందాల సోమశిలకు వెళ్లవచ్చు.. అక్కడి కృష్ణానది అందాలను వీక్షించవచ్చు.. అటు నుంచి శ్రీశైలం కూడా వెళ్లవచ్చు..
హైదరాబాద్ నుంచి సోమశిల టు శ్రీశైలం.. హెలికాప్టర్‌లో పర్యటన .. ఈ నెల 9న ప్రారంభం
ఒకరోజు పర్యటనకు రూ.1,10,000
రెండు రోజులకు రూ.1,40,000 చార్జి
విడిది, భోజన వసతి, వీఐపీ దర్శనాలు
కొల్లాపూర్, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): ఆకాశ మార్గాన అందాల సోమశిలకు వెళ్లవచ్చు.. అక్కడి కృష్ణానది అందాలను వీక్షించవచ్చు.. అటు నుంచి శ్రీశైలం కూడా వెళ్లవచ్చు.. ఇందుకోసం తెలంగాణ పర్యాటక శాఖ ఈ నెల 9వ తేదీ నుంచి హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తేనుంది. పర్యాటకులు, భక్తుల కోసం ఒకరోజు, రెండు రోజుల పర్యటన ప్యాకేజీలు ఉంటాయి. హైదరాబాద్ నుంచి నాగర్‌కర్నూల్ జిల్లాలోని సోమశిలకు బెల్-407 మోడల్ హెలికాప్టర్‌లో వెళ్లి.. కృష్ణానది అందాలతో పాటు.. లలితాంబిక సోమేశ్వర ఆలయంలో ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకోవచ్చు. అటునుంచి జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకునేలా తెలంగాణ టూరిజం శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ హెలీ టూరిజం అన్నివర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటుందని, హెలికాప్టర్ పర్యటన మాత్రమే కాకుండా ఇది ఆధ్యాత్మిక పర్యటనలా ఉండేలా ప్రణాళిక రూపొందించినట్లు పర్యాటక శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ హెలికాప్టర్ పర్యటనను హైదరాబాద్‌కు చెందిన ఆరాధ్య ట్రావెల్స్ చేపట్టనుంది. ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయని నిర్వాహకులు తెలిపారు.
పర్యటన ప్యాకేజీలు ఇలా...
ఒకరోజు ప్యాకేజీలో హెలికాప్టర్ ప్రయాణం, వీఐపీ తరహాలో దైవదర్శనానికి ఒక్కొక్క వ్యక్తికి రూ.1,10,000 చార్జీగా నిర్ణయించారు. ఉదయం 5.30 గంటలకు హైదరాబాద్‌లో హెలికాప్టర్ సిద్ధంగా ఉంటుంది. ఇది ఉదయం 7 గంటలకు సోమశిలకు చేరుకుంటుంది. భక్తులు, పర్యాటకులకు సోమశిల కృష్ణానది అందాలు చూపించడంతో పాటు అక్కడ ఉన్న లలితాంబిక సోమేశ్వరం ఆలయంలో ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శనం చేయిస్తారు. ఉదయం 8.30 గంటలకు హెలికాప్టర్ సోమశిల నుంచి బయలుదేరి మధ్యాహ్నం 11.30 గంటల వరకు శ్రీశైలం చేరుకుంటుంది. అక్కడ భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయంలో వీఐపీ దర్శనం చేయిస్తారు. మధ్యాహ్నం 11.30 గంటలకు హెలికాప్టర్ అక్కడి నుంచి బయలుదేరి 12:30 గంటలకు హైదరాబాద్‌కు పర్యాటకులు, భక్తులను చేర్చుతుంది.
రెండో ప్యాకేజీలో రెండు రోజుల బసకు గాను ఒక్కొక్క వ్యక్తికి రూ.1,40,000 చార్జీగా నిర్ణయించారు. విడిది గదులు, భోజన వసతితో పాటు అన్ని ఆలయాల్లో వీఐపీ తరహాలో దర్శనం ఉంటుంది. ఇందులో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకులకు హైదరాబాద్‌లో ఒక రోజు బస చేసేందుకు అవకాశం ఉంటుంది. సోమశిల గ్రామంలో ఒక రోజు బస, శ్రీశైలంలో ఒక రోజు బస చేసేందుకు వసతులు, భోజనాలు నిర్వాహకులే ఏర్పాటు చేస్తారు.
ప్రపంచ స్థాయి గుర్తింపు తెస్తాం: జూపల్లి
ప్రపంచ స్థాయి పర్యాటకులను ఆకర్షించేలా తెలంగాణ ప్రభుత్వం టూరిజాన్ని అభివృద్ధి చేస్తున ్నట్లు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. అందులో భాగంగానే హైదరాబాద్ వయా సోమశిల టు శ్రీశైలం వరకు హెలికాప్టర్ పర్యటనను ప్రారంభించబోతున్నామని చెప్పారు. కొల్లాపూర్ నియోజకవర్గాన్ని టూరిజం ప్రాంతంగా ప్రపంచస్థాయిలో గుర్తించేలా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.