Share News

మనీలాండరింగ్‌ కేసులో..హీరా గ్రూపు అధినేత నౌహీరాషేక్‌ అరెస్టు

ABN , Publish Date - May 23 , 2026 | 04:27 AM

దాదాపు రూ.3 వేల కోట్ల మనీలాండరింగ్‌ స్కామ్‌లో తప్పించుకుని తిరుగుతున్న హీరాగ్రూపు చైర్మన్‌ నౌహీరాషేక్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు గురువారం అర్ధరాత్రి హరియాణాలోని గుర్గావ్‌లో అరెస్టు చేశారు.

మనీలాండరింగ్‌ కేసులో..హీరా గ్రూపు అధినేత నౌహీరాషేక్‌ అరెస్టు

  • మారువేషంలో గుర్గావ్‌లోతలదాచుకున్న నిందితురాలు

  • రూ.3 వేల కోట్ల కుంభకోణం

హైదరాబాద్‌, మే 22 (ఆంధ్రజ్యోతి): దాదాపు రూ.3 వేల కోట్ల మనీలాండరింగ్‌ స్కామ్‌లో తప్పించుకుని తిరుగుతున్న హీరాగ్రూపు చైర్మన్‌ నౌహీరాషేక్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు గురువారం అర్ధరాత్రి హరియాణాలోని గుర్గావ్‌లో అరెస్టు చేశారు. మారుపేరుతో, పోర్జరీ ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డు ఉపయోగిస్తూ గుర్గావ్‌లోని ఒక సర్వీస్‌ అపార్ట్‌మెంట్‌లో మారువేషంతో ఉన్న ఆమెను ఎట్టకేలకు పట్టుకున్నారు. దేశవిదేశాల్లో 1,72,114మంది ఇన్వెస్టర్ల నుంచి నౌహీరాషేక్‌, ఆమె కంపెనీ ప్రతినిధులైన మోలి థామస్‌, బిజూథామస్‌ కలిసి రూ.3,000 కోట్ల పెట్టుబడులను సేకరించారు. డిపాజిట్‌దారులకు వారు 36ు వడీ ్డ ఆశ చూపారు. ఆపై ఇన్వెస్టర్లకు డబ్బు చెల్లించకపోవడంతో నౌహీరాషేక్‌ తదితరులపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలు కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో మనీలాండరింగ్‌ కోణంలో ఈడీ అధికారులు విచారణ ప్రారంభించారు. హీరా గ్రూపు పేరిట నౌహీరాషేక్‌ బంగారం, రియల్‌ ఎస్టేట్‌, పెట్టుబడులు అంటూ దేశ విదేశాల్లోని ఇన్వెస్టర్ల నుంచి రూ.3,000 కోట్లు వసూలు చేసిందని, ఎలాంటి అనుమతులు లేకుండా ఆమె సాగించిన దందాలో వేలాదిమంది బాధితులు ఉన్నారని సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్విస్టిగేషన్‌, ఈడీ సంయుక్త దర్యాప్తులో ఇప్పటికే వెల్లడైంది. తన ఆస్తులను కొనుగోలు చేయడానికి మౌల్వి అనే వ్యక్తి రూ.580కోట్లు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాడని నౌహీరాషేక్‌ సుప్రీంకోర్టుకు తెలియచేసింది. అయితే ఈడీ అధికారులు సదరు మౌల్వి ఖాతాల్లో అంత మొత్తాలు లేవని తేల్చారు. దీంతో నౌహీరాషేక్‌ బెయిల్‌ రద్దు చేస్తూ లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలు అమలులో భాగంగా ఈడీ.. నాంపల్లి స్పెషల్‌ కోర్టును ఆశ్రయించింది. నౌహీరా షేక్‌కు వ్యతిరేకంగా కోర్టు నాన్‌బెయిలబుల్‌ వారంట్‌(ఎన్‌బీడబ్ల్యూ) జారీ చేసింది. కాగా ఎన్‌బీడబ్ల్యూను కొట్టేయాలని నౌహీరాషేక్‌ హైకోర్టును ఆశ్రయించారు. గురువారం ఈ పిటిషన్‌పై జస్టిస్‌ ఈవీ వేణుగోపాల్‌ ధర్మాసనం విచారణ చేపట్టి ఆమెను లొంగిపోవాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలు వెలువడిన తర్వాత ఈడీ అధికారులు హ్యూమన్‌ ఇంటెలిజెన్స్‌, ట్రాకింగ్‌ ద్వారా నౌహీరాషేక్‌ మారువేషంలో మారుపేరుతో గుర్గావ్‌లోని ఎయిర్‌ బీఎన్‌బీకి చెందిన ఒక ఇంట్లో తలదాచుకున్నట్లు గుర్తించారు. హరియాణ పోలీసుల సాయంతో జాయింట్‌ ఆపరేషన్‌ నిర్వహించి ఆమెను అరెస్టు చేసి శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్‌కు తరలించి న్యాయమూర్తి వద్ద ప్రవేశపెట్టారు. నౌహీరాషేక్‌ను రిమాండ్‌కు తరలించాలని జడ్జి ఆదేశించడంతో ఆమెను ఈడీ అఽధికారులు జైలుకు తరలించారు.

Updated Date - May 23 , 2026 | 04:27 AM