Share News

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు

ABN , Publish Date - Sep 25 , 2026 | 03:58 AM

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. 24 గంటల్లో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో సరాసరి 98.75 మి.మీ. వర్షపాతం నమోదైంది

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు
kinnerasani project

  • నిండుతున్న చెరువులు, కుంటలు.. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు

  • ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 98.75 మి.మీ. వర్షపాతం

  • ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నిండిన మూసీ ప్రాజెక్టు

  • నిండుకుండలా ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్‌

  • రానున్న 24గంటల్లో భారీ వర్షాలు: ఐఎండీ

ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. 24 గంటల్లో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో సరాసరి 98.75 మి.మీ. వర్షపాతం నమోదైంది. రానున్న 24గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఉమ్మడి కరీంనగర్‌తో పాటు మంచిర్యాల, కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. బలమైన గాలుల కారణంగా కోతకు వచ్చిన వరి పైరు నేలకొరిగింది. పలు చోట్ల చెట్లు నేలకూలి, రవాణా, విద్యుత్‌ సరఫరాలకు అంతరాయం ఏర్పడింది. కుమరంభీం ప్రాజెక్టులోకి 5,139 క్యూసెక్కుల వరదనీరు, వట్టివాగు ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 1,800 క్యూసెక్కులు ఉంది. పెద్దవాగు పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సూర్యాపేట జిల్లాలో 10గంటల పాటు వాన

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ముసురుతో కూడిన వానతో పంటలకు ఊపిరి పోసినట్లుయింది. సూర్యాపేట జిల్లాలో 10గంటల పాటు కురిసిన వర్షానికి చెరువుల్లోకి నీరు వచ్చింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. మూసీ నది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు దిగువన మూసీ రిజర్వాయర్‌కు 460.55క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. 645అడుగులు(4.46టీఎంసీలు) పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం గల మూసీ ప్రాజెక్టు నీటిమట్టం గురువారం సాయంత్రానికి 641.60అడుగులు(3.35టీఎంసీలు)గా ఉంది. ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వకు 591.74క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.


ఉమ్మడి ఖమ్మం జిల్లా వాగుల్లో జలకళ

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎడతెరిపిలేకుండా వర్షం పడింది. మున్నేరు, ఆకేరు తదితర ఏర్లు, వాగుల్లో జలకళ కనిపిస్తోంది. జిల్లాలో 1.30 సెం.మీ సగటు వర్షపాతం నమోదైది. వైరా రిజర్వాయర్‌ పూర్తిస్థాయి నీటిమట్టాన్ని దాటింది. ఐదు అలుగుల నుంచి వరదనీరు దిగువకు ప్రవహిస్తోంది. అశ్వరావుపేట మండలంలోని పెదవాగు ప్రాజెక్టుకు భారీగా వరద చేరడంతో 6,800 క్యూసెక్కుల వరద దిగువకు వదిలారు. ములకలపల్లి మండలం మూకమామిడి ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటెత్తడంతో మత్తడి పోసింది. కిన్నెరసాని పూర్తిస్థాయి నీటిమట్టం 407 అడుగులు కాగా ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరదకు 405.60 అడుగులకు చేరింది. చర్ల మండంలోని తాలిపేరు ప్రాజెక్టుకు ఛత్తీ్‌సగఢ్‌ అటవీప్రాంతం నుంచి వరద వస్తుండటంతో 8గేట్లు ఎత్తి 10వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. భద్రాచలం వద్ద గోదావరి 16.80 అడుగుల వద్ద కొనసాగుతుండగా 1.23 క్యూసెక్కుల వరద ఫ్లో ఉంది. వానల కారణంగా సింగరేణి రీజియన్‌ పరిఽధిలోని కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు, సత్తుపల్లిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం ఘాట్‌ రోడ్డుపై కొండ చరియలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో ఎటువంటి వాహనాల రాకపోకలు, జనసంచారం లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

Updated Date - Sep 25 , 2026 | 03:58 AM