వాన, ఈదురుగాలుల బీభత్సం
ABN , Publish Date - Jun 13 , 2026 | 07:21 AM
ఉమ్మడి నల్లగొండ, ఆదిలాబాద్ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. గురువారం అర్ధరాత్రి, శుక్రవారం సాయంత్రం కురిసిన వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనూ శుక్రవారం సాయంత్రం కుండపోత వర్షం కురిసింది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దంచికొట్టిన వర్షం.. యాదాద్రి కొండపై కదిలిన షెడ్డు హ్యాంగర్లు
సూర్యాపేట జిల్లాలో విద్యుత్ శాఖకు రూ.80లక్షల నష్టం
రాఘవాపురంలో గోడ కూలి వృద్ధుడి మృతి
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
ఉమ్మడి నల్లగొండ, ఆదిలాబాద్ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. గురువారం అర్ధరాత్రి, శుక్రవారం సాయంత్రం కురిసిన వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనూ శుక్రవారం సాయంత్రం కుండపోత వర్షం కురిసింది. రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టపై కూడా వర్షం బీభత్సం సృష్టించింది. శుక్రవారం సాయంత్రం 6గంటల సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో భక్తులు ఉరుకులు, పరుగులు పెట్టారు. గాలి దుమారానికి కొండపై ఉన్న ఐదు తాత్కాలిక దుకాణాల టెంట్లు లేచిపోయాయి. అలాగే, జర్మన్ ఫ్యాబ్రిక్ హ్యాంగర్స్‌తో ఏర్పాటు చేసిన షెడ్డు బేస్‌కు బిగించిన సుమారు 8 స్టీల్ పిల్లర్లు పైకి లేచాయి. తూర్పు వీధిలోని ఎల్‌ఈడీ స్ర్కీన్ షార్ట్ సర్క్యూట్‌కు గురై అందులో నుంచి పొగలు చెలరేగాయి. సూర్యాపేట జిల్లాలో గురువారం రాత్రి కురిసిన వర్షానికి, ఈదురుగాలుల దెబ్బకు 780 విద్యుత్ స్తంభాలు, 30 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతినగా విద్యుత్ శాఖకు రూ.80లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. రాఘవాపురంలో వర్షానికి తడిసిన గోడ కూలగా.. ఆ శిథిలాలు పడి అనుముల మల్సూర్(75) అనే వృద్ధుడు మరణించాడు. మరోపక్క, యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం బొందుగుల గ్రామంలోనూ విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. అలాగే, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రాశులపై కప్పిన పరదాలు ఎగిరిపోవడంతో ధాన్యం తడిసి ముద్దయింది. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం పెర్క కొండారం గ్రామ పాత కొండారం రెవెన్యూ శివారులో నిమ్మతోటలు నేలకొరిగాయి. మరోపక్క, ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో గురువారం అర్ధరాత్రి ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఇంటి పైకప్పులు ఎగిరిపోయాయి.
హైదరాబాద్‌లో కుండపోత
హైదరాబాద్‌లో శుక్రవారం రాత్రి గంటపాటు కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని తీవ్ర ప్రభావితం చేసింది. పలుచోట్ల రహదారులు జలమయవ్వగా.. చాలాచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. రాజేంద్రనగర్‌లో అత్యధికంగా 7.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. భారీ వర్షం వల్ల .. శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోయింది.
వడదెబ్బతో ఇద్దరి మృతి
వడదెబ్బకు గురై సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెంకు చెందిన వేముల పుల్లమ్మ(54) అనే ఉపాధి హామీ కూలీ కాల్వ పూడికతీత పనులు నిర్వహిస్తుండగా స్పృహ తప్పింది. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించిందని వైద్యులు తెలిపారు. భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలం లచ్చతండా గ్రామానికి చెందిన జాటోతు భీమ్‌జీ(45) పత్తి విత్తనాలు నాటుతుండగా ఎండల తీవ్రతకు సొమ్మసిల్లి పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు.
నేడు, రేపు తేలికపాటి వర్షాలు
రాష్ట్రానికి నైరుతి రుతుపవనాలు వచ్చినా ఎండ తీవ్రత తగ్గడం లేదు. 21 జిల్లాల్లో 42 డిగ్రీలకుపైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వర్షం పడిన తర్వాత ఎండ తీవ్రత కారణంగా విపరీతమైన ఉక్కపోత ఏర్పడడంతో జనం అల్లాడిపోయారు. కాగా శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.