Share News

భారీ వర్షం.. ఈదురు గాలుల బీభత్సం

ABN , Publish Date - May 24 , 2026 | 05:21 AM

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో శనివారం సాయంత్రం ఒక్కసారిగా కురిసిన అకాల వర్షం, ఈదురు గాలులు భారీ బీభత్సాన్ని సృష్టించాయి.

భారీ వర్షం.. ఈదురు గాలుల బీభత్సం

  • మార్కెట్‌ యార్డుల్లో తడిసిన ధాన్యం

మహబూబ్‌నగర్‌, దేవరకొండ, మే 23 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో శనివారం సాయంత్రం ఒక్కసారిగా కురిసిన అకాల వర్షం, ఈదురు గాలులు భారీ బీభత్సాన్ని సృష్టించాయి. ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు కాసేపు ఉపశమనం కలిగించినా రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన వేలాది క్వింటాళ్ల ధాన్యం తడిసి ముద్దయింది. పలు చోట్ల ధాన్యం కుప్పలపై కప్పిన టార్పాలిన్‌లు ఈదురు గాలులకు ఎగిరిపోయాయి. వనపర్తి మార్కెట్‌ యార్డులో తడిసిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు నీటిని ఎత్తిపోశారు. నాగర్‌కర్నూలు జిల్లా తాడూరు మండల కేంద్రంతో పాటు పాపగల్‌, సిర్సవాడ, భలాన్‌పల్లి, ఐతోల్‌, గోవిందాయపల్లి, తుమ్మలసూగురు తదితర ప్రాంతాల్లో రైతులు రోడ్లపై ఆరబోసిన వరి, మొక్కజొన్నలు తడిసిపోయాయి. కొల్లాపూర్‌ మార్కెట్‌ యార్డులో, నల్లగొండ జిల్లా డిండి మండలంలో కల్లాల్లో ఆరబోసిన ధాన్యం వాన నీటిలో తడిసిపోయింది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో కొన్ని చోట్ల చెట్లు విరిగి రోడ్లపై పడడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలం పాలెంలోని అగ్రికల్చర్‌ యూనివర్సిటీ సమీపంలో భారీ వృక్షాలు రోడ్డుకు అడ్డంగా పడటంతో 2 కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోయాయి. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం చెల్లెపాడుకి, నాగర్‌కర్నూల్‌ జిల్లా తాడూరు మండలం గోవిందాయపల్లికి చెందిన గొర్రెల కాపరులు నాగార్జున (35), మల్లయ్య(45) పిడుగుపాటుకు మృతి చెందారు.

Updated Date - May 24 , 2026 | 05:21 AM