అకాల వర్షం..వడగండ్ల వాన
ABN , Publish Date - Mar 17 , 2026 | 04:56 AM
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. సంగారెడ్డి జిల్లా మన్నూర్‌లో అత్యధికంగా 2.4, మెదక్ జిల్లా రేగోడ్‌లో 1.8.....
ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ వర్షం
వడగండ్ల వానతో పంటలకు నష్టం
హైదరాబాద్‌లో చల్లబడిన వాతావరణం
నేడు, రేపు తేలికపాటి వర్షాలు
హైదరాబాద్ సిటీ, మేడ్చల్ టౌన్/ఘట్‌కేసర్, మెదక్, మార్చి16(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. సంగారెడ్డి జిల్లా మన్నూర్‌లో అత్యధికంగా 2.4, మెదక్ జిల్లా రేగోడ్‌లో 1.8, సంగారెడ్డి జిల్లా రాయికొడ్‌లో 1 సెంటీమీటర్ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురవగా, మరికొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు, తేలికపాటి వడగండ్లతో కూడిన వర్షం కురిసింది. మెదక్ జిల్లా తూప్రాన్, శివ్వంపేటలో 30 నిమిషాల పాటు భారీ వర్షం కురిసింది. పలుచోట్ల చెట్లు నేలకూలాయి. మామిడి తోటలు దెబ్బతినే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈదురుగాలులతో కూడిన వర్షంతో కొన్నిచోట్ల పంటలు దెబ్బతిన్నాయి. పలుచోట్ల చెట్లు కూలడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్‌లోని బాలానగర్, అల్వాల్, అసి్‌ఫనగర్, నాంపల్లి, ఖైరతాబాద్, మల్కాజిగిరి, అసి్‌ఫనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. మేడ్చల్ పట్టణం, ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలో వడగండ్ల వాన కురిసింది. రాష్ట్రంలో మంగళ, బుధవారాల్లో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న ఐదు రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపి మూడు నుంచి నాలుగు డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది.