Share News

దంచి కొట్టిన వడగళ్ల వాన!

ABN , Publish Date - Mar 25 , 2026 | 04:22 AM

హైదరాబాద్‌ నగరంలో అరగంట కురిసిన భారీ వర్షం.. పలు ప్రాంతాలను ఆగం చేసింది. మంగళవారం రాత్రి కురిసిన వడగళ్లవానతో పలు ప్రాంతాల్లో ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి.

దంచి కొట్టిన వడగళ్ల వాన!

  • రహదారులు జలమయం.. షేక్‌పేటలో అత్యధికంగా 5.1 సెం.మీ

  • నేడు, రేపు తేలికపాటి వర్షాలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

హైదరాబాద్‌ నగరంలో అరగంట కురిసిన భారీ వర్షం.. పలు ప్రాంతాలను ఆగం చేసింది. మంగళవారం రాత్రి కురిసిన వడగళ్లవానతో పలు ప్రాంతాల్లో ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. షేక్‌పేటలో అత్యధికంగా 5.1 సెం.మీ, గచ్చిబౌలిలో 3.6 సెం.మీ వర్షం కురిసింది. 15-20 నిమిషాల పాటు షేక్‌పేట, మెహిదీపట్నం, రాజేంద్రనగర్‌, జూబ్లీహిల్స్‌ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వడగళ్ల వాన కురిసింది. 30 నిమిషాలపాటు కురిసిన భారీవర్షంతో ఐటీ కారిడార్‌ రాయదుర్గం, గచ్చిబౌలి, కొండాపూర్‌, ఎర్రగడ్డ, అమీర్‌పేట ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌జాం సమస్యలు తలెత్తాయి. గచ్చిబౌలిలో ఈదురుగాలులకు భారీ వృక్షం నేలకూలడంతో కారు, ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి. షేక్‌పేట, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, సికింద్రాబాద్‌, కూకట్‌పల్లి ప్రాంతాల్లో ప్రధాన రహదారులపై మోకాలి లోతు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఈదురుగాలులతో చెట్లకొమ్మలు విద్యుత్‌తీగలపై పడి వెంగళ్‌రావునగర్‌, మధురానగర్‌ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు నెలకొన్నాయి. పహాడీషరీఫ్‌ ముదిరాజ్‌ కాలనీలో ట్రాన్స్‌ఫార్మర్‌కు ఫ్యూజ్‌ వేస్తుండగా విద్యుత్‌ కార్మికుడు లక్ష్మణ్‌ కరెంట్‌ షాక్‌తో మృతి చెందాడు. ఈదురుగాలులకు హైదరాబాద్‌లో 21 చోట్ల చెట్లు పడిపోగా వాటిని హైడ్రా బృందాలు తొలగించాయి. 11 చోట్ల రహదారులపై నీరు నిలిచిపోయిందనే ఫిర్యాదులందాయి. గచ్చిబౌలి డీఎల్‌ఎఫ్‌ రోడ్డులో రహదారి మధ్యన డివైడర్‌ మీద ఉన్న కరెంట్‌ స్తంభంపై చెట్టు పడిపోవడంతో ట్రాఫిక్‌ జాం అయింది. హైడ్రా డీఆర్‌ఎఫ్‌ బృందాలు దాన్ని తొలగించాయి. గుడిమల్కాపూర్‌, యూసు్‌ఫగూడ ప్రాంతాల్లో చెట్లు పడిపోగా వాటిని హైడ్రా బృందాలు తొలగించాయి. కామారెడ్డి జిల్లాలో మంగళవారం సాయంత్రం వడగండ్ల వర్షం కురిసింది. పలుచోట్ల ఈదురుగాలులతో వర్షం పడింది. కామారెడ్డి మునిసిపల్‌ పరిధిలోని రామేశ్వర్‌పల్లిలో కర్రెగొల్ల లింబాద్రికి చెందిన రెండు గేదెలు పిడుగు పాటుతో మృతి చెందాయి. కామారెడ్డితో పాటు దోమకొండ, భిక్కనూరు, రామారెడ్డి, సదాశివనగర్‌, రాజంపేట తదితర మండలాల్లో దాదాపు అరగంట పాటు భారీ వర్షం కురిసింది. కొన్నిచోట్ల వడగండ్ల వర్షం కురవడంతో మొక్కజొన్న, జొన్న వరి పంటలకు నష్టం వాటిల్లింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వీర్నపల్లి, చందుర్తి మండలాల్లో మంగళవారం వడగళ్ల వర్షం కురిసింది. వంద ఎకరాల్లో వరి పంట దెబ్బతిందని రైతులు తెలిపారు.

నేడు, రేపు తేలికపాటి వర్షాలు

తెలంగాణలో బుధ, గురువారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న బుధవారం జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, హన్మకొండ, జనగాం, వరంగల్‌, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్‌, నారాయణపేట, జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మహబూబాబాద్‌ జిల్లా గార్లలో 13 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Updated Date - Mar 25 , 2026 | 04:22 AM