రేపట్నుంచి మండే ఎండలు!
ABN , Publish Date - Feb 26 , 2026 | 02:27 AM
ఫిబ్రవరి ముగియకముందే భానుడి భగ భగ మొదలైంది. ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం నుంచి తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
22 జిల్లాలకు యెల్లో అలెర్ట్
హైదరాబాద్/కేసముద్రం/యాదాద్రి, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): ఫిబ్రవరి ముగియకముందే భానుడి భగ భగ మొదలైంది. ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం నుంచి తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. 22 జిల్లాల్లో 35-36 డిగ్రీలకు మించి పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని తెలిపింది. ఆయా జిల్లాలకు ఎండ తీవ్రతకు సంబంధించి యెల్లో అలెర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా నల్లగొండ, సూర్యాపేట, భూపాలపల్లి, పెద్దపల్లి, జగిత్యాల, ములుగు, మంచిర్యాల జిల్లాల్లో 36-37 డిగ్రీల మధ్య పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది. ఇక రాత్రిపూట కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. 15-20 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. మరోవైపు.. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు పడ్డాయి. ఆదిలాబాద్ జిల్లా సోనాలలో 1.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహబూబాబాద్ జిల్లాలో గాలివాన బీభత్సంతో పంటలకు నష్టం వాటిల్లింది. ఆ జిల్లాలోని కేసముద్రం, కొత్తగూడ, గూడురు మండలాల్లో చాలా చోట్ల మొక్కజొన్న, కొన్ని చోట్ల వరి నేలవాలింది. ఓటాయిలో విద్యుత్తు స్తంభాలు కూలాయి. పలుచోట్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది. చేతికందిన మొక్కజొన్న పంట నేల వాలడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇటు యాదాద్రి భువనగిరి జిల్లాలోని పలు మండలాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. యాదగిరిగుట్టలో కురిసిన వర్షంతో కొండపై లక్ష్మీనృసింహుల కల్యాణం కోసం వేసిన మ్యాట్లు, పట్టాలు తడిచిపోగా తిరిగి పొడివి ఏర్పాటు చేశారు.