Share News

వడదెబ్బతో గుండె, మెదడుకు చేటు

ABN , Publish Date - May 07 , 2026 | 04:40 AM

మెదడు, గుండె, మూత్రపిండాలు, ఇతర కీలక అవయవాలను వడదెబ్బ వేగంగా ప్రభావితం చేయగలదని, ప్రమాద సంకేతాలను ముందుగానే గుర్తించి...

వడదెబ్బతో గుండె, మెదడుకు చేటు

  • ప్రమాద సంకేతాలను ముందుగానే గుర్తించాలి

  • ఏఐజీ ఆస్పత్రుల చైర్మన్‌ నాగేశ్వర రెడ్డి సూచన

  • ‘బీట్‌ ది హీట్‌’ పేరుతో ఏఐజీ అవగాహన కార్యక్రమం

హైదరాబాద్‌ సిటీ, మే 6(ఆంధ్రజ్యోతి): మెదడు, గుండె, మూత్రపిండాలు, ఇతర కీలక అవయవాలను వడదెబ్బ వేగంగా ప్రభావితం చేయగలదని, ప్రమాద సంకేతాలను ముందుగానే గుర్తించి, చర్యలు తీసుకోవాలని ఏఐజీ ఆస్పత్రుల చైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌ రెడ్డి సూచించారు. శరీరం ఉష్ణోగ్రతను నియంత్రించుకునే సామర్థ్యాన్ని కోల్పోయినప్పుడు వడదెబ్బ తగులుతుందని, ఇది సాధారణ జ్వరంలాంటిది కాదని చెప్పారు. చికిత్సలో ఆలస్యం జరిగితే మెదడు, గుండె, మూత్రపిండాలు, కండరాలు వేగంగా దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వడదెబ్బ నివారణపై అవగాహన కల్పించేందుకు ఏఐజీ హాస్పిటల్స్‌ ‘బీట్‌ ది హీట్‌’ అనే కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించింది. అలసట, తల తిరగడం, వికారంగా అనిపించడం, లేదా తలనొప్పి, కండరాల నొప్పులను మామూలేనని కొట్టిపారేయొద్దని బంజారాహిల్స్‌ ఏఐజీ డైరెక్టర్‌ డాక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ కొప్పుల సూచించారు. వడదెబ్బ తగిలినప్పుడు మొదటి కొన్ని నిమిషాలు కీలకమైనవని, వైద్య సహాయం ఏర్పాటు చేస్తూనే శరీరాన్ని చల్లబరచడం చాలా ముఖ్యమని ఎమర్జెన్సీ మెడిసిన్‌ విభాగాధిపతి డాక్టర్‌ ఇమ్రాన్‌ షరీఫ్‌ తెలిపారు. బాధితుడిని నీడలోకి లేదా ఏసీ ఉన్న ప్రదేశానికి తరలించడం, అదనపు దుస్తులు తొలగించడం, చల్లనినీరు లేదా తడిగుడ్డలను అద్దడం, విసనకర్రతో విసరడం, మెడ, చంకలు, గజ్జల చుట్టూ ఐస్‌ ప్యాక్‌లు లేదా చల్లటి టవల్స్‌ ఉంచడం వంటి చర్యలు చేపట్టాలన్నారు. ఆ వ్యక్తికి పూర్తి స్పృహ ఉంటే, చిన్న చిన్న గుక్కల నీరు ఇవ్వవచ్చని చెప్పారు.

ఈ జాగ్రత్తలు పాటించండి...

వడదెబ్బ నివారణకు జాగ్రత్తలు పాటించాలని ‘బీట్‌ ది హీట్‌’ కార్యక్రమంలో వైద్యులు సూచించారు. అవి.. క్రమం తప్పకుండా నీరు తాగాలి. దాహం వేసే వరకు వేచి ఉండద్దు. ఎండ తీవ్రంగా ఉండే సమయంలో బయటకు వెళ్లొద్దు. లేత రంగు, గాలి ఆడే దుస్తులు ధరించాలి. బయటకు వెళ్లినప్పుడు టోపీ లేదా గొడుగు ఉపయోగించాలి. తరచుగా నీడలో, చల్లని ప్రదేశంలో విశ్రాంతి తీసుకుంటుండాలి. ఎండ వేడి పెరిగాక వ్యాయామం చేయొద్దు. తీవ్రమైన వేడిలో మద్యం, అధిక కెఫిన్‌కు దూరంగా ఉండాలి. కుటుంబంలోని వృద్ధుల యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉండాలి. పిల్లలను, పెంపుడు జంతువులను పార్క్‌ చేసిన వాహనాల్లో ఒంటరిగా వదిలిపెట్టి వెళ్లొద్దు.

Updated Date - May 07 , 2026 | 04:40 AM