Share News

Assembly session: నీళ్లపై నిప్పులు!

ABN , Publish Date - Jan 02 , 2026 | 04:43 AM

అసెంబ్లీ వేదికగా ‘నీళ్ల’పై నిప్పులు కురవనున్నాయి. కృష్ణా జలాలు, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు అంశాలపై యుద్ధానికి అధికార, ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. ప్రతిపక్షాల ఆరోపణలను గట్టిగా తిప్పికొట్టేందుకు తగిన సమాచారం....

Assembly session: నీళ్లపై నిప్పులు!

  • పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు.. కృష్ణా జలాలపై సర్కారు చర్చకు సిద్ధం

  • మంత్రులు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చిన ఉత్తమ్‌

  • దిశానిర్దేశనం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి

  • కృష్ణా జలాలపై చర్చించేందుకు రండి!

  • కేసీఆర్‌కు మరోమారు సీఎం ఆహ్వానం

  • గౌరవానికి ఎలాంటి హాని కలగకుండా చూసుకుంటానని హామీ

  • అసెంబ్లీకి ముగిసిన 3 రోజుల విరామం

  • నేటి నుంచి శీతాకాల సమావేశాలు పునః ప్రారంభం

హైదరాబాద్‌, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ వేదికగా ‘నీళ్ల’పై నిప్పులు కురవనున్నాయి. కృష్ణా జలాలు, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు అంశాలపై యుద్ధానికి అధికార, ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. ప్రతిపక్షాల ఆరోపణలను గట్టిగా తిప్పికొట్టేందుకు తగిన సమాచారం, అవగాహనతో అధికార పక్షం సన్నద్ధమైతే.. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ ఏర్పాట్లు చేసుకుంటోంది. జలాలు, ప్రాజెక్టులపై ఇప్పటిదాకా మీడియా సమావేశాలు, పత్రికా ప్రకటనలతో కలబడిన ఇరుపక్షాల నేతలు.. ఇక అసెంబ్లీ వేదికగా ముఖాముఖి వాదనలు వినిపించనున్నారు. మూడు రోజుల విరామం తర్వాత అసెంబ్లీ శీతాకాల సమావేశాలు శుక్రవారం నుంచి తిరిగి ప్రారంభం అవుతున్నాయి. ఇందులో పాలమూరు ప్రాజెక్టుపై చర్చను శనివారం లేదా ఆదివారం చేపట్టే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

కేసీఆర్‌కు మరోమారు సీఎం ఆహ్వానం

90 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు 45 టీఎంసీల కృష్ణా జలాలను మాత్రమే తీసుకునేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం అంగీకరించిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపిస్తున్నారు. అసలు ఈ ప్రాజెక్టును జూరాల నుంచి శ్రీశైలానికి కేసీఆర్‌ మార్చడంతోనే రెండు రాష్ట్రాల మధ్య వివాదమై కూర్చుందని సీఎం రేవంత్‌, మంత్రి ఉత్తమ్‌ వాదన వినిపిస్తున్నారు. కేసీఆర్‌ సైతం పాలమూరు-రంగారెడ్డికి సంబంధించి కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈక్రమంలో కృష్ణా జలాలు, పాలమూరు ప్రాజెక్టుపై అసెంబ్లీలో చర్చించేందుకు రావాలని కేసీఆర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి తాజాగా మరోమారు ఆహ్వానించారు. కేసీఆర్‌ గౌరవానికి ఎలాంటి హాని కలగకుండా చూసుకుంటానని కూడా హామీ ఇచ్చారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌, నల్లగొండ జిల్లాల కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు శుక్రవారం పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి అసెంబ్లీలో చర్చకు కేసీఆర్‌ రావాలని కోరనున్నారు. మొత్తంగా ఈ అంశంపై చర్చకు కేసీఆర్‌ హాజరయ్యేలా అధికార పార్టీ ఒత్తిడి పెంచుతోంది.


రాజకీయంగా రెండు పార్టీలకూ కీలకమే..!

కృష్ణా జలాలు, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులపై చర్చ కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ రెండు పార్టీలకూ ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఈ అంశాలపై మంత్రులు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు సమగ్ర అవగాహన కల్పించడం కోసం గురువారం ప్రజాభవన్‌లో మంత్రి ఉత్తమ్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో తెలంగాణకు ఏ విధంగా అన్యాయం జరిగిందన్న దానిని సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. సభలో బీఆర్‌ఎస్‌ సభ్యుల ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని సూచించారు. మరోవైపు బీఆర్‌ఎస్‌ నాయకత్వం కూడా పూర్తి వివరాలు సిద్ధం చేసుకుని, అధికార పార్టీ ప్రశ్నలకు దీటుగా బదులిచ్చేందుకు కసరత్తు చేస్తోంది.

బీసీ రిజర్వేషన్లపైనా చర్చ!

అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అంశంపైనా చర్చ చేపట్టే అవకాశం ఉంది. మున్సిపల్‌, పరిషత్‌ ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో చర్చించి అన్ని పార్టీల భాగస్వామ్యంతో ఒక నిర్ణయానికి వస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ఇంతకుముందే చెప్పారు కూడా. ఇక తెలంగాణ రైజింగ్‌ విజన్‌-2047, మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ విభజన, ఫ్యూచర్‌ సిటీ అభివృద్ధి అంశాలపైనా చర్చ జరిగే అవకాశం ఉంది.

ఐదు బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం ఐదు బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది. తెలంగాణ మున్సిపల్‌ చట్ట సవరణ బిల్లు, గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ చట్ట సవరణలకు సంబంధించి రెండు బిల్లులు, ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును సీఎం రేవంత్‌రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. ఇక మోటారు వాహనాల పన్నుల చట్టం సవరణ బిల్లును మంత్రి పొన్నం ప్రభాకర్‌ సభలో ప్రవేశపెడతారు. ఇక ఉపాధి హామీ చట్టంపై స్వల్పకాలిక చర్చను నిర్వహించనున్నారు.

Updated Date - Jan 02 , 2026 | 04:43 AM