Share News

బైక్‌పై తండ్రి మృతదేహాన్ని కూర్చోబెట్టి..బాధను దిగమింగుతూ 11 కి.మీ ప్రయాణం

ABN , Publish Date - Feb 11 , 2026 | 02:54 AM

తండ్రి మరణించాడన్న బాధ ఓ వైపు.. కనీసం ఆ మృతదేహాన్ని తరలించేందుకు కూడా డబ్బుల్లేని దైన్యం మరోవైపు... దుఃఖంతో నిండిన ఆ పసి మనసుని మెలిపెడుతుండగా తన తండ్రి అంతిమ పయనానికి ద్విచక్ర వాహనమే దిక్కయింది.

బైక్‌పై తండ్రి మృతదేహాన్ని కూర్చోబెట్టి..బాధను దిగమింగుతూ 11 కి.మీ ప్రయాణం

  • ఆటోకు డబ్బుల్లేక నిరుపేద యువకుడి దైన్యం

  • బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలో దారుణం

కర్లపాలెం, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): తండ్రి మరణించాడన్న బాధ ఓ వైపు.. కనీసం ఆ మృతదేహాన్ని తరలించేందుకు కూడా డబ్బుల్లేని దైన్యం మరోవైపు... దుఃఖంతో నిండిన ఆ పసి మనసుని మెలిపెడుతుండగా తన తండ్రి అంతిమ పయనానికి ద్విచక్ర వాహనమే దిక్కయింది. ఆస్పత్రి వద్ద మహాప్రస్థానం వాహనం కూడా అందుబాటులో లేని దౌర్భాగ్య స్థితిలో... ఆ యువకుడు తండ్రి మృతదేహాన్ని బైక్‌పై కూర్చోబెట్టుకుని తీసుకెళ్తున్న దృశ్యం మనసులను కలచివేసింది. భుజానికి ఆనుకుని నిర్జీవంగా పడిఉన్న తండ్రి మృతదేహాన్ని 11 కిలోమీటర్లపాటు తీసుకెళ్తూ ఆ కుమారుడు పడిన మానసిక వేదన వర్ణనాతీతం..! బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం చింతాయపాలెం గ్రామ పరిధిలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. కర్లపాలెం మండలం చింతాయపాలెం గ్రామంలోని రాళ్ల చెరువు కట్టపైన నివాసముండే నక్కా నాగేసు మంగళవారం ఉదయం గుండె పోటుతో కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన బైక్‌పైనే బాపట్లలోని ఏరియా ఆస్పత్రికి తీసుకురాగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు మహాప్రస్థానం సేవలు ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో.. ఆటో కోసం ప్రయత్నించారు. అయితే ఆటోకు రూ.3,000 అడగడం, జేబులో చిల్లిగవ్వ లేకపోవడంతో చేసేది లేక నాగేసు కుమారుడు తన సోదరుడి సాయంతో తండ్రి మృతదేహాన్ని బైక్‌పై కూర్చోబెట్టుకుని స్వగ్రామానికి తీసుకెళ్లాడు. యానాది కుటుంబానికి చెందిన నక్కా నాగేసు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఆయనకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా, బాపట్ల ఏరియా ఆస్పత్రిలో మహాప్రస్థానం వాహనం అందుబాటులో లేదని కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ తెలిపారు. మహాప్రస్థానం వాహనం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తున్నట్లు వివరించారు. అయితే నక్కా నాగేసు కుటుంబ దీన స్థితి తమ దృష్టికి తీసుకువస్తే మృతదేహం తీసుకెళ్లడానికి ఏర్పాట్లు చేసేవారమని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. కానీ.. ఆ సమయంలో అక్కడ కనీస స్థాయిలో కూడా సిబ్బంది పట్టించుకోలేదని తెలుస్తోంది.

Updated Date - Feb 11 , 2026 | 02:54 AM