వైద్యం.. బాదుడే బాదుడు
ABN , Publish Date - May 04 , 2026 | 04:34 AM
ఆరోగ్యం బాగున్నంతవరకూ అంతా ఓకే! అనారోగ్యం పాలై ఆస్పత్రికి వెళ్తే మాత్రం.. చికిత్స కోసం ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితులు దేశవ్యాప్తంగా కనిపిస్తున్నాయని తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
దేశవ్యాప్తంగా భారీగా పెరిగిన ఆస్పత్రి ఖర్చులు
మన దగ్గర.. దేశ సగటు కంటే 55 శాతం అధికం
మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో కొంత మెరుగు
ప్రైవేటు దోపిడీతో సామాన్యుడి జేబుకు చిల్లు
గ్రామాల్లో సర్కారీ దవాఖానాల్లోనే ప్రసవాలు
పట్టణ ప్రాంతాల్లో మాత్రం ప్రైవేటులోనే ఎక్కువ
అంటువ్యాధులు తగ్గుతున్నప్పటికీ.. భారీగా పెరిగిపోతున్న జీవనశైలి వ్యాధి బాధితుల సంఖ్య
నేషనల్ శాంపిల్ సర్వే నివేదికలో వెల్లడి
హైదరాబాద్, మే 3 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్యం బాగున్నంతవరకూ అంతా ఓకే! అనారోగ్యం పాలై ఆస్పత్రికి వెళ్తే మాత్రం.. చికిత్స కోసం ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితులు దేశవ్యాప్తంగా కనిపిస్తున్నాయని తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఆస్పత్రి ఖర్చులు ఆకాశాన్నంటుతున్నాయని.. అందునా వైద్య ఖర్చులు మిగతా అన్ని రాష్ట్రాల కన్నా మన తెలంగాణలోనే అత్యధికమని.. కేంద్ర గణాంక, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన 80వ రౌండ్ నేషనల్ శాంపిల్ సర్వే (ఎన్‌ఎస్ఎస్)లో తేలింది. ఈ సర్వే ప్రకారం.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం నేటికీ సామాన్యుడికి అందుబాటులోనే ఉంది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సగటు ఖర్చు రూ.1,100 మాత్రమే. కానీ, మెరుగైన సౌకర్యాల కోసమో, అత్యవసర పరిస్థితుల్లోనో ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తే మాత్రం జేబులు గుల్లవుతున్నాయి.
నివేదికలోని కీలక అంశాలు..
దేశంలో ప్రజల సగటు ఆస్పత్రి ఖర్చు రూ.34,064 కాగా, తెలంగాణలో అది ఏకంగా రూ. 52,743గా ఉంది. అంటే దేశ సగటు కంటే తెలంగాణలో వైద్యం ఖర్చు 55 శాతం ఎక్కువగా ఉంది.
పల్లె, పట్టణం అనే తేడా లేకుండా.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని చోట్లా వైద్య ఖర్చులు ఎక్కువగా ఉంటున్నాయి. తెలంగాణలో ఒక వ్యక్తి ప్రైవేటు ఆస్పత్రిలో చేరితే సగటున రూ.72,561 వెచ్చించాల్సి వస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రిలో అయితే తన జేబు లోంచి రూ.5,856 దాకా ఖర్చు చేయాల్సివస్తోంది.
దక్షిణాది రాష్ట్రాలన్నింటా.. ఆస్పత్రి ఖర్చులు జాతీయ సగటు కంటే ఎక్కువే. తమిళనాట ఆ ఖర్చులు రూ.48,288 (ప్రైవేటులో అత్యధికంగా రూ.80,923)గా ఉండగా.. కేరళలో రూ.41,410, కర్ణాటకలో రూ.40,599, ఏపీలో రూ.39,170గా ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది.
దక్షిణాదిన మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ పరిస్థితే కొంతమెరుగ్గా ఉంది. ఏపీలో కూడా.. ప్రైవేటు ఆస్పత్రుల్లో సగటున రూ.58,077 ఖర్చవుతోంది.
తమిళనాడులో ప్రైవేటు వైద్యం ప్రభుత్వ వైద్యం కంటే 60రెట్లు ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది కాగా, తెలంగాణలో అది 12రెట్లు ఎక్కువగా ఉంది.
దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య గత మూడు దశాబ్దాల్లో గణనీయంగా పెరిగినట్లు ఎన్‌ఎ్‌సఎ్‌స నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణాల్లో ఆసుపత్రి చేరికలు ఎక్కువగా నమోదవుతున్నాయి. 1995-96 కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 1000 మందికి సుమారు 13 కేసులు మాత్రమే ఉండగా, 2014 నాటికి ఇది 35కి చేరి.. 2025 నాటికి 27కి తగ్గింది. పట్టణ ప్రాంతాల్లో 1995-96లో సగటున 20 కేసులు ఉండగా, 2014లో ఇది 44కి ఎగబాకింది. తరువాత స్వల్ప తగ్గుదలతో 2025లో 32గా నమోదైంది.
వయసు పెరిగే కొద్దీ ఆస్పత్రిలో చేరేవారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన వారిలో ఈ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ వయసులో ప్రతి 1,000 మంది పురుషుల్లో 93 మంది, మహిళల్లో 69 మంది ఏదో ఒక అనారోగ్యం కారణంగా ఆస్పత్రి పాలు కావాల్సి వస్తోంది. వెయ్యి మంది వృద్థుల సగటును తీసుకుంటే ఇది 81గా నమోదైంది.
సర్వే సగటు ప్రకారం ఏడాది కాలంలో ప్రతి వెయ్యి మంది పురుషుల్లో 30 మంది ఆస్పత్రిలో చేరగా, మహిళల్లో ఈ సంఖ్య 28గా ఉంది. నాలుగేళ్ల లోపు చిన్నారుల్లో ప్రతి 1000 మందిలో మగపిల్లలు 42 మంది, ఆడపిల్లలు 27 మంది ఆస్పత్రి పాలయ్యారు. 5 నుండి 29 ఏళ్ల లోపువారిలో ఆస్పత్రి చేరికల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ, 30 ఏళ్ల దాటినప్పటి నుండి గ్రాఫ్ క్రమంగా పెరుగుతూ వస్తోంది. మధ్య వయస్కులు (45-59 ఏళ్లు) కూడా గణనీయంగా (వెయ్యికి 42 మంది) ఆస్పత్రుల్లో చేరుతున్నట్లు ఈ నివేదిక వెల్లడించింది.
మరికొన్ని ముఖ్యాంశాలు..
గ్రామీణుల్లో 66.8శాతం మంది ప్రసవం కోసం ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్తుంటే.. పట్టణాల్లో 47శాతం మందే వెళ్తున్నారు. పల్లె ప్రాంతాల మహిళలు డెలివరీ కోసం ప్రైవేటు దవాఖానాలకు 28.8 శాతం వెళితే... పట్టణ మహిళల్లో 50.8శాతం మంది వెళ్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆస్పత్రుల్లో డెలివరీ చేయించుకునే వారి శాతం 95.4 ఉండగా, ఇంటివద్దే 4.4 శాతం మంది ప్రసవిస్తున్నారు. పట్టణాల్లో 97.8శాతం మంది ఆస్పత్రుల్లో.. 2.2శాతం మంది ఇంటివద్ద ప్రసవిస్తున్నారు.
దేశంలో అంటువ్యాధులు తగ్గుతున్నప్పటికీ.. జీవనశైలి వ్యాదులు భయంకరంగా పెరుగుతున్నట్లు ఎన్‌ఎస్ఎస్ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా.. మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు, శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారి సంఖ్య పెద్ద ఎత్తున పెరిగినట్లు పేర్కొంది.
రాష్ట్రంలో సర్వే ఇలా..
తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 233 పల్లెలు, పట్టణ ప్రాంతాలకు సమీపంలోని మరో 300 రూరల్ ఏరియాల్లో ఎన్‌ఎస్ఎస్ సర్వే నిర్వహించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో మొత్తం 17,233 మందిని ప్రశ్నించారు.