kumaram bheem asifabad- ఆరోగ్య బాట.. మునగ తోట
ABN , Publish Date - Jun 06 , 2026 | 10:47 PM
మునగ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందో చెప్పనక్కర లేదు. నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. సాగు విస్తీర్ణం అంతంత మాత్రంగా ఉండడంతో వీటి ధరలు ఎక్కువే ఉంటాయి. దీంతో పేదలు కొనుగోలు చేసేందుకు వెనుకడుగు వేస్తుంటారు. దీన్ని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మునగ సాగును మహిళ సంఘాల ద్వారా ప్రోత్సహించాలని నిర్ణయించింది.
కాగజ్‌నగర్, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): మునగ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందో చెప్పనక్కర లేదు. నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. సాగు విస్తీర్ణం అంతంత మాత్రంగా ఉండడంతో వీటి ధరలు ఎక్కువే ఉంటాయి. దీంతో పేదలు కొనుగోలు చేసేందుకు వెనుకడుగు వేస్తుంటారు. దీన్ని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మునగ సాగును మహిళ సంఘాల ద్వారా ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాలో ఆసక్తి ఉన్న వారి వివరాలను సంబంధిత అధికారులు సేకరిస్తున్నారు.
ఉపాధి హామీ ద్వారా..
మునగ తోట సాగుకు ముందుకొచ్చే వారికి పెట్టుబడి ఖర్చులకు ఇబ్బంది ఉండదు. మొక్కలు కొనుగోలు, గుంతల తవ్వకం, మొక్కలు నాటడం కోసం అయ్యే ఖర్చు వీబీజీ రాంజీ(ఉపాధి హామీ) పథకం ద్వారా చెల్లిస్తారు. ఎకరానికి వెయ్యి మొక్కలు నాటుతారు. ఒక మొక్కకు సగటున 200 కాయల వరకు దిగుబడి వస్తోంది. తోటల ఏర్పాటుకు ముందుకు వచ్చే మహిళ సంఘాల సభ్యులకు ఎకరానికి రూ.94,982 అందుతుందని అధికారులు చెబుతున్నారు. సొంతంగా వ్యవసాయ భూమి ఉన్న మహిళా సంఘాల సభ్యులకు మునగ తోటతో అదనపు ఆదాయం సమకూరనుంది. ఖర్చు లేకుండా తోట ఏర్పాటు చేసి ఫలసాయం పొందే అవకాశాలున్నాయి. ఉపాధి హామీ పథకంలో పని చేస్తూ జాబ్ కార్డు కలిగి ఉన్న వారికి, సొంత భూమి కలిగి ఉండడంతో పాటు నీటి వసతి కూడా ఉండాలి. సన్న, చిన్నకారు రైతులు అంటే ఐదు ఎకరాల్లోపు వ్యవసాయ భూమి ఉన్న వారు ఇప్పటికే మునగతోట ఉన్న వారు అనర్హులని అధికారులు చెబుతున్నారు. మునగ సాగు, వినియోగం పెరిగితే అదనపు ఆదాయంతో పాటు ఆరోగ్యపరంగా మేలు చేకూరనుండడంతో సాగు ఆసక్తి ఉన్న వారి పేర్లను సంబంధిత వెబ్ సైట్‌లో నమోదు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో అత్యధికులు తోటలు వేస్తే మునగ దిగుబడులు పెరుగనున్నాయి. జిల్లాలో 15 మండలాలు, 15 మండల సమైఖ్యలు, 398 గ్రామ సంఘాలు, స్వయం సహాయక సంఘాలు 7,947, సభ్యులు 91,161 మంది ఉన్నా రు. అందరికి అవగాహన కల్పిస్తూ అధికారులు ఈ దిశగా అడుగులు వేస్తున్నారు.