మూడు పదుల వయసులోనే.. మధుమేహం
ABN , Publish Date - Apr 08 , 2026 | 05:52 AM
యవ్వనంలో ఉన్నాం.. ఆరోగ్యంగానే ఉంటాంలే అని ధీమాగా ఉండే కుర్రకారుకు నిజంగా ఇది షాకింగ్ న్యూసే! ఎందుకంటే, 30 ఏళ్ల లోపు యువతలోనే ప్రీ డయాబెటిక్ కేసులు అధికంగా బయటపడుతున్నాయని.....
ప్రతి ఐదుగురిలో ఒకరు ప్రీ డయాబెటిక్
69 శాతం మందిలో విటమిన్ డీ లోపం
46 శాతం మందిలో ప్రీ హైపర్ టెన్షన్
కార్పొరేట్ ఉద్యోగుల్లో 80 శాతం అధిక బరువు సమస్య
పెరుగుతున్న రొమ్ము క్యాన్సర్ కేసులు
అపోలో హాస్పిటల్స్ ‘హెల్త్ ఆఫ్ ది నేషన్ 2026’ నివేదికలో వెల్లడి ఇక పక్కాగా క్యాన్సర్ కేసుల లెక్క! నోటిఫైడ్ డిసీజ్‌గా గుర్తిస్తూ జీవో
‘పోర్టల్’ను ప్రారంభించిన దామోదర
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): యవ్వనంలో ఉన్నాం.. ఆరోగ్యంగానే ఉంటాంలే అని ధీమాగా ఉండే కుర్రకారుకు నిజంగా ఇది షాకింగ్ న్యూసే! ఎందుకంటే, 30 ఏళ్ల లోపు యువతలోనే ప్రీ డయాబెటిక్ కేసులు అధికంగా బయటపడుతున్నాయని అపోలో హాస్పిటల్స్ వార్షిక నివేదిక వెల్లడించింది. ప్రతీ ఐదుగురిలో ఒకరు ప్రీ డయాబెటిక్ అని పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య దినాన్ని పురస్కరించుకుని మంగళవారం ‘హెల్త్ ఆఫ్ ది నేషన్-2026’ పేరుతో ఈ నివేదికను అపోలో విడుదల చేసింది. గతేడాది దేశంలోని అపోలో హాస్పిటల్స్ గ్రూప్ వ్యాప్తంగా దాదాపు 30 లక్షల మందిపై జరిపిన ఆరోగ్య పరీక్షల ఆధారంగా నివేదికను రూపొందించారు. దీంట్లో యువత ముఖ్యంగా, 30ఏళ్లలోపు వారిలో ఆరోగ్య సమస్యలను విస్తారంగా చర్చించారు. మూడింట రెండొంతల మందికి శారీర దారుఢ్యం ఉండటం లేదని, బలహీనంగా ఉంటున్నారని ఈ అధ్యయనం వెల్లడించింది. వీరిలో శారీరక శ్రమ లేకపోవడం అనేక ఆరోగ్య సమస్యలను వెంట పెట్టుకుని వస్తుందని హెచ్చరించింది. అంతేకాదు, ఈ వయసు వారిలో 69 శాతం మంది లో విటమిన్ డీ లోపం ఉందని, 59 శాతం మంది ఊబకాయులేనని, 52 శాతం మందిలో అసాధారణ కొలెస్ట్రాల్ స్థాయిలు కనబడుతున్నాయని పేర్కొంది. ప్రతి ముగ్గురిలో ఇద్దరు సంక్రమణేతర వ్యాధుల ప్రమాదాన్ని కలిగి ఉన్నారని, ఈ వయసు ఉద్యోగులలో దాదాపు సగం మంది ప్రీ డయాబెటిక్ లేదంటే డయాబెటిక్‌గా ఉన్నారని తెలిపిం ది. విద్యార్థుల పరంగా చూస్తే ప్రతి 10 మంది విద్యార్థులలో నలుగురు ఊబకాయులుగా ఉండటం గమనార్హం. 46 శాతం మంది ప్రీ హైపర్ టెన్షన్ బాధితులు, 45 శాతం మందిలో విటమిన్ బీ 12 ఉండాల్సిన స్థాయిలో లేదు. మూడోవంతు మంది విద్యార్థినిలలో రక్తహీనత కనిపిస్తుందని అపోలో నివేదిక తెలియజేసింది. మొత్తమ్మీద 30ఏళ్లలోపు వయసు వారిలో నలుగురిలో ఒకరు మాత్రమే సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు స్పష్టం చేసిం ది. నివేదిక విడుదల సందర్భంగా అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపక ఛైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి మాట్లాడు తూ.. అసలైన ఆరోగ్యమనేది వ్యక్తిగతమైనది, ముందుచూపుతో కూడుకున్నదన్నారు. సరైన సమయంలో, సరైన పరీక్షల ద్వారా గుండెవ్యాధులతో పాటుగా క్యాన్సర్‌లను కూడా తొలిదశలోనే గుర్తించడం సాధ్యమవుతుందని అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతా రెడ్డి తెలిపారు. భవిష్యత్‌లో వ్యాధులను జనాభా, ప్రాంతాల వారీగా వర్గీకరించి, వాటి నివారణకు చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు. అపోలో నివేదికలో ఉన్న వివరాల్లో ముఖ్యమైనవి..
కార్పొరేట్ ఉద్యోగులు: కార్పొరేట్ ఉద్యోగుల్లో అధిక బరువు ఒక ప్రధాన సమస్యగా ఉంది. సగటున 38 ఏళ్ల వయసున్న దాదాపు ఐదు లక్షల మంది కార్పొరేట్ ఉద్యోగుల ఆరోగ్య పరీక్షల్లో వెల్లడైన విషయం ఏమిటంటే వారిలో ప్రతి పదిమందిలో ఎనిమిది మంది అధిక బరువుతో ఉన్నారని. దాదాపు సగం మంది ప్రీ డయాబెటిక్/ డయాబెటిక్స్‌గా ఉన్నారు. ప్రతి నలుగురిలో ఒకరు అధిక రక్తపోటు కలిగి ఉన్నారు. మూడింట రెండొంతల మంది వారానికి కనీసం 150 నిమిషాల శారీరక వ్యాయామాలు కూడా చేయడం లేదు. ఈ ఉద్యోగులలో 55 శాతం మంది అసాధారణ కొలెస్ట్రాల్ స్థాయిలను కలిగి ఉన్నారు. ఈ లక్షణాలే గుండె జబ్బుల బారిన పడటానికీ కారణమవుతున్నాయి. గుండె వ్యాధులకు సంబంధించి హై రిస్క్ పేషంట్‌లలో ప్రతి ఐదుగురిలో నలుగురు అధిక బరువుతో ఉన్నవారే. శారీరక శ్రమ లేకపోవటం వల్లే అధిక బరువు.
మహిళలు: 20లలో ఉన్న మహిళల్లో విటమిన్ బీ 12 లోపం అధికంగా కనబడుతోంది. సంతానోత్పత్తికి, నరాల సంబంధిత ఆరోగ్యానికీ ఇది అత్యంత కీలకమైన విటమిన్. 40లలో ఉన్న మహిళల్లో అధిక బరువు సమస్య ఎక్కువగా ఉంటోంది. ముఖ్యంగా, పొట్ట దగ్గర పేరుకుపోయే కొవ్వు ఆరోగ్యానికి ప్రమాదకారిగా మారుతోంది. ప్రతి పది మందిలో తొమ్మిది మంది దీనివల్ల ప్రభావితమవుతున్నారు. మధుమేహ ప్రమాదమూ రెండున్నర రెట్లు పెరుగుతోంది. మహిళలల్లో రొమ్ము క్యాన్సర్ కేసులు సగటున 51 ఏళ్లకే బయటపడుతున్నాయి.
ప్రాంతాల వారీగా: మధురైలో 36 శాతం మంది దీని బారిన పడే అవకాశాలుంటే, ముంబైలో 16 శాతం లోనే ఇది కనిపిస్తుంది. అలాగే రక్తహీనత సమస్య తూర్పు, ఈశాన్య భారతాలతో పోలిస్తే దక్షిణ భారతదేశంలో రెండురెట్లు తక్కువగా ఉంది. ఉత్తరాదిలో ఊబకాయులు ఎక్కువగా ఉంటే, హైదరాబాద్‌లో 25 శాతం మంది మధుమేహం రిస్క్‌లో ఉన్నారు.
హృదయం.. దాచేస్తోంది!
గుండె.. అన్ని సమయాల్లోనూ హెచ్చరికలు చేయడం లేదు. రక్త పరీక్షలో గుండె సమస్యలను గుర్తించలేకపోవచ్చు కానీ, ఇమేజింగ్ పరీక్షలతో గుర్తించవచ్చు. ముఖ్యంగా కరొనరీ కాల్షియం స్కోర్‌తో ధమనుల్లో కాల్షియం నిల్వలు గుర్తించవచ్చు. ఇక లివర్‌ను సైలెంట్ కిల్లర్‌గానే పరిగణించాలి. అలా్ట్ర సౌండ్‌లో ఫ్యాటీ లివర్‌గా గుర్తించినవారిలో 74 శాతం మందిలో రక్త పరీక్షలు చేస్తే సాధారణ స్ధాయిలోనే ఎంజైమ్‌లు కనబడుతున్నాయి. తీవ్రమైన ఫ్యాటీ లివర్ కేసులలో కూడా పదిమందిలో ఆరుగురిలో ఇదే పరిస్థితి ఉంది. కానీ, ఈ రోగులలో 27 శాతం మంది మధుమేహం, 87 శాతం మంది ఊబకాయం, 66 శాతం మంది అసాధారణ కొలెస్ట్రాల్ స్థాయిలను కలిగి ఉన్నారు. ఫ్యాటీ లివర్‌కు, మధుమేహానికి సంబంధం ఉందని తాజా అధ్యయనం మరోసారి నిరూపిస్తోంది. ఆరోగ్యకరమైన గట్ మైక్రోబియం ఉన్న వారిలో అధిక హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్ స్థాయి ఉన్నట్లు వెల్లడైంది. 1.15 లక్షల మందిని పరీక్షిస్తే ప్రతి 15 మందిలో ఒకరు డిప్రెషన్‌తో, పది మందిలో ఒకరు ఆందోళనతో ఉన్నట్లు తేలింది. నిద్రలేమి సమస్య ప్రతి ఐదుగురిలో ఒకరిలో కనబడుతోంది. దీర్ఘకాలిక ఆరోగ్యానికి శారీరక శ్రమ అత్యవసరం. తగినంత శ్రమ లేకపోతే గుండె వ్యాధుల ముప్పు పెరగటమే కాదు.. కీళ్లు అరగడం, ఎముకల సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉంది.
తెలంగాణలో ఇలా..
అపోలో ‘హెల్త్ ఆఫ్ ది నేషన్-2026’లో తెలంగాణకు సంబంధించి కూడా పలు కీలకమైన వివరాలున్నాయి. రాష్ట్రంలో పరీక్షలు జరుపుకున్న వారిలో 25.5 శాతం మందికి మధుమేహం, 27.3 శాతం మందికి హైబీపీ, 22.2శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నట్లు వెల్లడైంది. 81.2శాతం మంది అధిక బరువు లేదా ఊబకాయం సమస్యతో ఉన్నారు. 70.6 శాతం మందిలో రక్తంలో కొవ్వు పదార్థాల అసమతుల్యత (లిపిడ్ లెవెల్స్ అసాధారణంగా) ఉంది. ఇక హైదరాబాద్ పరంగా చూస్తే.. పరీక్షించిన వారిలో 25.3ు మందికి మధుమేహం, 27.3శాతం మందికి అధిక రక్తపోటు, 22.1 శాతం మందికి రక్తహీనత ఉంది. 81.3 శాతం మంది అధిక బరువు లేదా ఊబకాయంతో ఉన్నారు.