సీఎం మామకు బీమా సంస్థ చుక్కలు!
ABN , Publish Date - Jul 25 , 2026 | 06:40 AM
చిన్నతనంలో పోలియో వచ్చిన విషయం ప్రస్తావించనందుకు వైద్య బీమా క్లెయిమ్‌ను నిరాకరించిన బీమా సంస్థకు వినియోగదారుల ఫోరమ్ షాక్ ఇచ్చింది.
పోలియో గురించి చెప్పలేదని శస్త్రచికిత్స క్లెయిమ్ తిరస్కరణ
ఐదేళ్లు పాలసీ కట్టించుకున్నాక కొర్రీ వేస్తే కుదరదు
వడ్డీతో సహా చెల్లించాలని వినియోగదారుల ఫోరం ఆదేశం
హైదరాబాద్ సిటీ, జూలై 24 (ఆంధ్రజ్యోతి): చిన్నతనంలో పోలియో వచ్చిన విషయం ప్రస్తావించనందుకు వైద్య బీమా క్లెయిమ్‌ను నిరాకరించిన బీమా సంస్థకు వినియోగదారుల ఫోరమ్ షాక్ ఇచ్చింది. తొమ్మిది శాతం వడ్డీతో బీమా మొత్తం, ఆలస్యానికి పరిహారం 45 రోజుల్లో చెల్లించాలని ఆదేశించింది. సదరు ఆరోగ్య బీమా సంస్థ అడ్డగోలు నిబంధనలు చూపుతూ క్లెయిమ్ చెల్లించకపోవడంపై ఫోరమ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వైకల్య వ్యక్తుల రక్షణ చట్టం ప్రకారం శిక్షార్హమైన నేరం అవుతుందని హెచ్చరించింది. బాధితుడు సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మామగారు కావడం గమనార్హం. బంజారాహిల్స్ ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో ఉంటున్న సూదిని పద్మారెడ్డి(76)కి మూడేళ్ల వయస్సులోనే పోలియో సోకి, అంగవైకల్యం సంభవించింది. ఆయన 2019లో నివా బూపా ఆరోగ్య బీమా సంస్థ నుంచి రూ.20 లక్షల పాలసీ కొనుగోలు చేశారు. తర్వాత ఈ పాలసీని 2025 వరకు రెన్యువల్ చేయించుకుంటూ వచ్చారు. పాలసీ తీసుకున్న సమయంలో బీమా సంస్థ ప్రతినిధి కళ్లకు స్పష్టంగా కనిపించే విధంగా పద్మారెడ్డి అంగవైకల్యం ఉంది. ఆయన దాచే ప్రయత్నం కూడా చేయలేదు. కాకపోతే బీమా సంస్థ ప్రతినిధి దాన్ని నమోదు చేయలేదు. పద్మారెడ్డికి 2024 మేలో చాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు కరోనరీ యాంజియోగ్రామ్ చేశారు. శస్త్ర చికిత్స, ఆస్పత్రి ఖర్చులు కలిపి రూ.23.5 లక్షల బిల్లు అయ్యింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో జనరేట్ అయిన అన్ని బిల్లులను బీమా సంస్థకు సమర్పించారు. పాలసీ తీసుకున్న సమయంలో ఆయనకు పోలియో ఉన్నట్లుగా నమోదు చేయలేదని సాకు చూపుతూ బీమా సంస్థ ప్రతినిధులు క్లెయిమ్‌ను నిరాకరించారు. దాంతో సూదిని పద్మారెడ్డి తనకు న్యాయం చేయాలని వినియోగదారుల ఫోరంలో పిర్యాదు చేశారు.
పాలసీ తీసుకుంటున్న సమయంలో ఫారంలో వైకల్యం గురించి ప్రస్తావించలేదని, కాబట్టి సంస్థ నిబంధనల ప్రకారం బీమా క్లెయిమ్‌ను తిరస్కరించామని వివా బూపా లిఖిత పూర్వక వివరణ ఇచ్చింది. వినియోగదారుల ఫోరం వివా బూపా బీమా సంస్థ తీరును తప్పుబట్టింది. ఫిర్యాదుదారుడు 2019 నుంచి పాలసీని ఐదేళ్లుగా పునరుద్ధరించుకుంటూ వస్తున్నారని, ఈ సమయంలో భీమా సంస్థ ప్రతినిధులు ఆయన వైకల్య పరిస్థితి గమనించే అవకాశం ఉన్నప్పటికీ పట్టించుకోకుండా సరిగ్గా బీమా చెల్లించాల్సిన పరిస్థితి వచ్చినపుడు ఆ కారణం చూపి తిరస్కరించడం తప్పని ఫోరమ్ అభిప్రాయపడింది. బీమా సంస్థ వ్యవహార శైలి దివ్యాంగుడైన సీనియర్ సిటిజన్‌ను అవమానించే విధంగా ఉందని వ్యాఖ్యానించింది. వైకల్యం సాకుగా చూపుతూ క్లెయిమ్‌ను తిరిస్కరిస్తే డిసేబుల్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. వైకల్యం ఉన్నప్పటికీ పాలసీ తీసుకున్న సమయంలో ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఏదైనా కారణాలతో ఆనారోగ్యానికి గురైతే క్లెయిమ్ ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పింది. క్లెయిమ్ మొత్తం రూ.20 లక్షలకు 9 శాతం వడ్డీ, మానసిక వేదనకు గురి చేసినందుకు రూ.2 లక్షల పరిహారం, కోర్టు ఖర్చుల నిమిత్తం రూ.10 వేలు బాధితుడికి ఇవ్వాలని బీమా సంస్థను ఆదేశించింది. అదనంగా వినియోగదారుల రక్షణ చట్టం కింద మరో లక్ష రూపాయల పరిహారాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి 45 రోజుల్లోగా జమ చేయాలని చెప్పింది. 45 రోజులు దాటితే మరో లక్ష పరిహారం చెల్లించాలని ఆదేశిస్తూ వక్కంటి నర్సింహారావు, పీవీటీఆర్ జవహర్‌బాబులతో కూడిన ఫోరం బెంచ్ జూలై 15న తీర్పును వెలువరించింది.