Share News

Health Minister Damodara Rajanarsimha: త్వరలోనే హెల్త్‌ కార్డులు

ABN , Publish Date - Jan 06 , 2026 | 02:37 AM

హెల్త్‌ కార్డుల కోసం టెండర్లు పిలిచామని, వాటిని త్వరలోనే జారీ చేయనున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.

Health Minister Damodara Rajanarsimha: త్వరలోనే హెల్త్‌ కార్డులు

  • మరో 8 ఆస్పత్రుల్లో ఎంఆర్‌ఐలు,485 వెంటిలేటర్లు

  • ఇంకో 73 డయాలసిస్‌ కేంద్రాలు మంత్రి దామోదర నరసింహ

హైదరాబాద్‌, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): హెల్త్‌ కార్డుల కోసం టెండర్లు పిలిచామని, వాటిని త్వరలోనే జారీ చేయనున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. నిమ్స్‌లో 813 పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకున్నామని, నియామక ప్రక్రియ ఫైలు ఆర్థిక శాఖకు చేరిందని, అనుమతి రాగానే నియామకాలు చేపడతామని వెల్లడించారు. పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన జవాబు ఇచ్చారు. రూ.192 కోట్లతో మార్చినాటికి మహబూబ్‌నగర్‌, సూర్యాపేట్‌, నిజామాబాద్‌, నల్గొండ, సిద్దిపేట్‌, నిలోఫర్‌తోపాటు ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో అదనంగా ఎంఆర్‌ఐ యంత్రాలను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. రూ.60 కోట్లతో సీటీ స్కాన్‌, రూ.32 కోట్లతో లైనాక్‌ యంత్రాలు పెట్టనున్నామని తెలిపారు. నిమ్స్‌లో రూ.18 కోట్లతో న్యూరో సర్జరీ విభాగం పెట్టామని, 15 కొత్త వెంటిలేటర్‌ బెడ్లు ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో 1,770 వెంటిలేటర్లు పనిచేస్తున్నాయని, ఫిబ్రవరి నాటికి 485 అదనపు వెంటిలేటర్లు పెట్టనున్నామని తెలిపారు. రాష్ట్రంలో 103 డయాలసిస్‌ కేంద్రాలు ఉన్నాయని, మరో 73 కేంద్రాలు త్వరలో ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. కాగా, ఆధార్‌ కార్డులు లేవనే కారణంతో ఇతర రాష్ట్రాల రోగులను ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేర్చుకోవడం లేదని, అవి లేకపోయినా వారిని చేర్చుకోవాలని చార్మినార్‌ ఎమ్మెల్యే మీర్‌ జుల్ఫీకర్‌ అలీ ప్రభుత్వాన్ని కోరారు.

నిషేధిత గడ్డిమందును కట్టడి చేయాలి: పాల్వాయి హరీశ్‌ బాబు

నిషేధిత గడ్డి మందు విక్రయాలు రాష్ట్రంలో జరుగుతున్నాయని, వెంటనే వాటిని కట్టడి చేయాలని సిర్పూర్‌-కాగజ్‌నగర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీశ్‌ బాబు ప్రభుత్వాన్ని కోరారు. ఆత్మహత్య చేసుకోవడానికి మోనోక్రోటోఫాస్‌ వాడుతున్నవారు.. దానితో ప్రయోజనం లేదని పారాపిట్‌ గడ్డి మందును వాడుతున్నారని, దీన్ని కట్టడి చేయాలని స్పష్టం చేశారు. బ్రెయిన్‌ స్ట్రోక్‌, గుండెపోటుతో ఆస్పత్రులకు వచ్చేవారికి వెంటిలేటర్‌ సౌకర్యం వెనువెంటనే లభిస్తే.. వారిని కాపాడటానికి అవ కాశం ఉంటుందని, పలు ఆస్పత్రుల్లో వీటి కొరత తీవ్రంగా ఉందని, ఇటీవలే నిమ్స్‌ ఆస్పత్రిలో వెంటిలేటర్‌ కోసం ఆర్‌ఎంవోను విజ్ఞప్తి చేస్తే తప్ప దొరకలేదని వివరించారు. కాగా, రెండు గంటల్లో రీనల్‌ డయాలసిస్‌ చేస్తే గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడే వారిని బతికించే అవకాశం ఉంటుందని డోర్నకల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మురళీనాయక్‌ వివరించారు. ప్రైవేట్‌ ఆస్పత్రులకు చెందిన ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపులు చేస్తున్నా... ప్రభుత్వ ఆస్పత్రుల బిల్లులు చెల్లించడం లేదని ఆరోపించారు.

Updated Date - Jan 06 , 2026 | 02:37 AM