Share News

kumaram bheem asifabad-చేతి రాతే భవిష్యత్తుకు బాట..

ABN , Publish Date - Feb 23 , 2026 | 10:41 PM

అందమైన చేతిరాత విద్యార్థుల భవిష్యత్తుకు బాట వేస్తుంది. తలరాతను మార్చి ఉత్తమ ఫలితాలకు మార్గం చూపుతుంది. పిల్లలకు చేతి రాతే వ్యక్తీకరణ సాధనం. ఆయుధం. వాళ్లు తరగతి గదిలో మాటల ద్వారా కనపరిచే తెలివితేటలు పరీక్షకు నిలవవు, చేతి రాత ద్వారా ఎదైతే రాస్తారో.. రాసి మెప్పిస్తారో అదే నిలుస్తుంది. కానీ దురదృష్టం ఏంటంటే పిల్లల చేతి రాత గురించి పెద్దలు దృష్టి పెట్టలేక పోతున్నారు.

kumaram bheem asifabad-చేతి రాతే భవిష్యత్తుకు బాట..
స్టడీ అవర్‌లో చదువుకుంటున్న విద్యార్థులు

- విద్యార్థులు ప్రత్యేక దృష్టి సారిస్తే మేలు

వాంకిడి, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): అందమైన చేతిరాత విద్యార్థుల భవిష్యత్తుకు బాట వేస్తుంది. తలరాతను మార్చి ఉత్తమ ఫలితాలకు మార్గం చూపుతుంది. పిల్లలకు చేతి రాతే వ్యక్తీకరణ సాధనం. ఆయుధం. వాళ్లు తరగతి గదిలో మాటల ద్వారా కనపరిచే తెలివితేటలు పరీక్షకు నిలవవు, చేతి రాత ద్వారా ఎదైతే రాస్తారో.. రాసి మెప్పిస్తారో అదే నిలుస్తుంది. కానీ దురదృష్టం ఏంటంటే పిల్లల చేతి రాత గురించి పెద్దలు దృష్టి పెట్టలేక పోతున్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు సరిదిద్దులేక పోతున్నా రు. ఆత్మవిశ్వాసం కలిగిన విద్యార్థులు చదువులోనూ ముందంజలో ఉంటారు. తరగతిలో మొదటిస్థానంలో ఉండే అవకాశాలు అధికంగా ఉంటాయి. ముత్యాల్లాంటి గుండ్రని అక్షరాలతో సమాధానాలు స్పష్టంగా రాయడం అలవర్చుకుంటే మూల్యాంకనం చేసే వారికి సదభిప్రాయం ఏర్పడుతుంది. ఇంతటి ప్రాధాన్యంఉన్న చేతిరాతపై చాలా మంది విద్యార్థులు అలసత్వం వహిస్తుంటారు. ఫలితంగా ప్రతిభ ఉన్నా...ఆశించిన మార్కులు సాధించలేకపోతున్నారు. పరీక్షల సమయంలో విద్యార్థులు రాసే జవాబు పత్రాల్లో చేతిరాత ఆణిముత్యాల్లా ఉంటే మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. మార్చి 14 నుంచి పదోతరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో చేతిరాతపై విద్యార్థులు ప్రత్యేక దృష్టి సారిస్తే మంచి మార్కులు సాధించుకోవచ్చు.

- విద్యార్థికి పదోతరగతి కీలకం..

ప్రతి విద్యార్థి జీవితంలో పదో తరగతి కీలకం. వార్షిక పరీక్షల్లో చేతి రాత కీలకంగా ఉంటుంది. అవగాహనతో రాయడం ప్రారంభించాలి. మొదటి వరసలో ఎంత బాగా రాశామో చివరి వరకు కూడా అదేవిధంగా చేతిరాతను కొసాగించాలి. వాక్య నిర్మాణంలో తప్పులు దొర్లకుండా జాగ్రత్త వహించాలి. రాసే సమయంలో ఎలాంటి తొందరపాటు సరికాదు. చేతిరాత బాగున్న వారికి క్రమశిక్షణ బాగుంటుందనే విషయం గురువుల దృష్టిలో ఉంటుంది. మన చేతిరాతను చూసిన వారు మనపై ఓ అంచనాకు వస్తారని నిపుణుల అభిప్రాయం. అందువల్ల ఆణిముత్యం లాంటి అక్షరాలతో అందరిని ఆకట్టుకోవచ్చన్న విషయాన్ని విద్యార్థులు గ్రహించుకోవాలి.

ఇలా చేస్తే ప్రయోజనం..

- సమాధాన పత్రంపై ఒక్కో పేజీలో 16 నుంచి 18 లైన్లకు మించకుండా రాయాలి.

- వాక్యాలు చక్కగా ఉండేలా రాయాలి. గణితంలో అంకెలు స్పష్టంగా ఉండేలా రాయాలి. కొట్టివేతలు, దిద్దడం అసలు చేయరాదు.

- ఆంగ్లంలో పెద్ద అక్షరాలు అవసరమైన చోట వాడాలి. అడిగిన ప్రశ్నకు సూటిగా జవాబు రాయాలి.

- శీర్షికలు ఉపశీర్షికలు ముఖ్యాంశాలు స్పష్టంగా కనిపించేలా వాటి కింద గీతలు గీయాలి.

- చేతిరాత ఆందంగా, ఆకట్టుకునేలా ఉండాలి.

- గీత చివరి వరకు రాస్తూ చివరికి వెళ్లగానే అక్కడ సగం పదం రాసి, మరో సగాన్ని కింది వరుసలో రాస్తుంటారు. దీంతో దిద్దేవారికి ఆ పూర్తి పదం ఏంటో వెంటనే అర్థం కాదు. అందువల్ల పూర్తి పదం ఒకే వరుసలో రాయాలి.

మార్కుల సాధనకు కీలకం..

వడ్లూరి రాజేష్‌, ఉపాధ్యాయుడు

మార్కుల సాధనలో అందమైన చేతిరాత ఎంతో కీలకం. అందువల్ల విద్యార్థులకు చేతిరాతలో మెలకువలు గురించి వివరిస్తున్నాం. చదువుతో పాటు అక్షరాలు అందంగా రాయడం సాధన చేస్తే మెరుగైన ఫలితం ఉంటుంది. ప్రతి విద్యార్థి చేతిరాతపై ప్రత్యేకదృష్టి సారించి మెరుగైన ఫలితాలు సాధించాలి.

Updated Date - Feb 23 , 2026 | 10:41 PM