Share News

ట్రాఫిక్‌ చలాన్ల కోసం బలవంతం చేయొద్దు

ABN , Publish Date - Jan 21 , 2026 | 05:17 AM

ట్రాఫిక్‌ చలాన్లు చెల్లించాలంటూ వాహనదారులను బలవంతం చేయరాదని.. పెండింగ్‌ చలాన్లు చెల్లించడానికి వాహనదారులు ముందుకు వస్తే వసూలు చేయవచ్చని హైకోర్టు పేర్కొంది.

ట్రాఫిక్‌ చలాన్ల కోసం బలవంతం చేయొద్దు

  • వాహన తాళాలు లాక్కోవడం సరి కాదు

  • కోర్టు ద్వారా చర్యలు తీసుకోవాలి:హైకోర్టు

హైదరాబాద్‌, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): ట్రాఫిక్‌ చలాన్లు చెల్లించాలంటూ వాహనదారులను బలవంతం చేయరాదని.. పెండింగ్‌ చలాన్లు చెల్లించడానికి వాహనదారులు ముందుకు వస్తే వసూలు చేయవచ్చని హైకోర్టు పేర్కొంది. అంతే తప్ప.. చలాన్ల వసూలులో భాగంగా వాహనాల తాళం చెవులు లాగేసుకుని, వాహనదారులను అడ్డుకునే అధికారం పోలీసులకు లేదని తేల్చిచెప్పింది. చలాన్లు వసూలు చేయడానికి పోలీసులు కఠిన మార్గాలు అవలంబిస్తున్నారని.. వాహనదారులను ఇబ్బందిపెడుతున్నారని పేర్కొంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై జస్టిస్‌ ఎన్వీ శ్రవణ్‌కుమార్‌ ధర్మాసనం విచారణ చేపట్టి.. ట్రాఫిక్‌ చలాన్ల వసూలు కోసం బలవంతపు చర్యలకు పాల్పడరాదని స్పష్టం చేసింది. ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించినవారికి విధించిన జరిమానా చెల్లించకపోతే.. చట్టప్రకారం సంబంధిత కోర్టు ద్వారా వారిపై చర్యలు తీసుకోవచ్చని పేర్కొంది. ఈ ఆదేశాలు సాధారణ తనిఖీలకు వ్యతిరేకం కాదని తెలుపుతూ.. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని హోంశాఖ,డీజీపీ, హైదరాబాద్‌ ట్రాఫిక్‌ జాయింట్‌ కమిషనర్‌లకు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 3వ తేదీకి వాయిదా వేసింది.

Updated Date - Jan 21 , 2026 | 05:17 AM