TS High Court: జప్తుచేసిన భూములను నిషేధిత జాబితాలో పెట్టరా?
ABN , Publish Date - Jan 11 , 2026 | 03:17 AM
వివిధ కేసుల్లో సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు జప్తుచేసిన భూములను నిషేధిత జాబితాలో పెట్టకపోవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది.
వాటి రిజిస్ట్రేషన్లను అడ్డుకోరా?.. ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న
నౌహీరా షేక్ భూములను వేలం వేయొద్దన్న పిటిషన్ కొట్టివేత
హైదరాబాద్, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): వివిధ కేసుల్లో సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు జప్తుచేసిన భూములను నిషేధిత జాబితాలో పెట్టకపోవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. వాటి రిజిస్ట్రేషన్లను అడ్డుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై లేదా? అని ప్రశ్నించింది. కేసుల్లో ఇరుక్కున్న భూములను కొనుగోలు చేయవద్దంటూ అవగాహన కల్పించాల్సిన బాధ్యత రిజిస్ట్రేషన్ శాఖకు లేకపోవడమేమిటని నిలదీసింది. డిపాజిట్‌దార్లను మోసం చేసిన కేసులో హీరాగ్రూప్, ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నౌహీరాషేక్‌కు సంబంధించిన భూములను వేలం వేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం అల్లూరులోని దాదాపు 10 ఎకరాల భూమిని ఈడీ వేలం వేయడాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్ నానక్‌రామ్‌గూడకు చెందిన షేరాజ్‌ఖాన్, మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ భూమిని తాము కొనుగోలు చేశామని, దానిని రిజిస్ట్రేషన్ చేయాలంటే ఈడీ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) తెచ్చుకోవాలని అధికారులు చెబుతున్నారని పేర్కొన్నారు.ఈడీ వేలాన్ని అడ్డుకోవడంతోపాటు రిజిస్ట్రేషన్ చేసేలా సబ్‌రిజిస్ట్రార్‌కు ఆదేశాలు జారీచేయాలని కోరారు. విచారణ చేపట్టిన జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మాసనం పిటిషనర్‌ల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేసింది. సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన తర్వాత భూముల వేలం ఆపాలంటూ పిటిషన్ దాఖలు చేయడంపై అసహనం వ్యక్తం చేసింది. 2019లో ఈడీ జప్తు చేసిన ఆస్తిని 2022లో ఎలా కొనుగోలు చేస్తారని ప్రశ్నిస్తూ.. పిటిషన్‌ను కొట్టివేసింది. ఇలాంటి భూములను వెంటనే నిషేధిత జాబితాలో పెడితే సమస్యలు ఉత్పన్నం కావని, ఆ మేరకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది.