Share News

మన శంకర వరప్రసాద్‌ అదనపు ఆదాయం లెక్కలివ్వండి

ABN , Publish Date - Jan 24 , 2026 | 04:55 AM

ప్రముఖ హీరో చిరంజీవి నటించిన ‘మన శంకర్‌ వరప్రసాద్‌గారు’ చిత్రానికి టికెట్ల పెంపు ద్వారా వచ్చిన అదనపు ఆదాయం వివరాలు ఇవ్వాలని హైకోర్టు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

మన శంకర వరప్రసాద్‌ అదనపు ఆదాయం లెక్కలివ్వండి

  • జీఎస్టీ వివరాలూ ఇవ్వండి.. అధికారులకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌, జనవరి 23(ఆంధ్రజ్యోతి): ప్రముఖ హీరో చిరంజీవి నటించిన ‘మన శంకర్‌ వరప్రసాద్‌గారు’ చిత్రానికి టికెట్ల పెంపు ద్వారా వచ్చిన అదనపు ఆదాయం వివరాలు ఇవ్వాలని హైకోర్టు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. టిక్కెట్ల పెంపుద్వారా అదనంగా రూ.42 కోట్లు వచ్చిందని చెబుతున్నందున ఆ సమాచారం ఇవ్వాలని తెలిపింది. పన్ను వివరాలు, గణాంకాలను తమ ముందు ఉంచాలని జీఎస్టీ అధికారులకు స్పష్టం చేసింది. ఈ సినిమా టికెట్‌ ధరలు పెంచుతూ ఈ నెల 8న హోంశాఖ ముఖ్యకార్యదర్శి మెమో జారీ చేయడాన్ని సవాలు చేస్తూ పిటిషన్‌ దాఖలయింది. ఈ మెమో అక్రమమని, దీని సాయంతో రూ.42 కోట్లు ఆర్జించినందున ఆ సంపాదన కూడాఅక్రమమే అవుతుందని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. అందువల్ల ఆ సొమ్ము మొత్తాన్ని రికవరీ చేసేలా ఆదేశాలివ్వాలని న్యాయవాది పాదూరి శ్రీనివాసరెడ్డి ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ ఎన్వీ శ్రవణ్‌కుమార్‌ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. వాదనలు విన్న ధర్మాసనం.. కౌంటర్లు వేయాలని నిర్మాతలు షైన్‌ స్ర్కీన్‌ ఇండియా, గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌ట్రైన్‌మెంట్స్‌, దర్శకుడు అనిల్‌ రావిపూడి, డిస్ట్రిబ్యూటర్‌ దిల్‌రాజు, బుక్‌మైషో, డిస్ట్రిక్ట్‌(జొమాటో) నోటీసులు ఇచ్చింది.

Updated Date - Jan 24 , 2026 | 04:55 AM