Share News

వ్యక్తిగత హాజరు నుంచి రేవంత్‌కు మినహాయింపు

ABN , Publish Date - Feb 20 , 2026 | 01:37 AM

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో నమోదైన రెండు ఎఫ్‌ఐఆర్‌లకు సంబంధించి ట్రయల్‌ కోర్టులో వ్యక్తిగత హాజరు నుంచి సీఎం రేవంత్‌రెడ్డి మినహాయింపు ఇస్తూ...

వ్యక్తిగత హాజరు నుంచి రేవంత్‌కు మినహాయింపు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో నమోదైన రెండు ఎఫ్‌ఐఆర్‌లకు సంబంధించి ట్రయల్‌ కోర్టులో వ్యక్తిగత హాజరు నుంచి సీఎం రేవంత్‌రెడ్డి మినహాయింపు ఇస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. రేవంత్‌రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు భూపాలపల్లిలో నిర్వహించిన బహిరంగ సభల్లో తనను భూకబ్జాదారుడు అని, సింగరేణిలో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డానంటూ తప్పుడు ఆరోపణలు చేశారని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వేర్వేరు ఫిర్యాదులు చేశారు. ఈ కేసులు కొట్టివేయాలని కోరుతూ రేవంత్‌రెడ్డి తాజాగా హైకోర్టులో క్వాష్‌ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ కే సుజన ధర్మాసనం.. ఆ కేసుల్లో దిగువ కోర్టులో వ్యక్తిగతంగా హాజరుకాకుండా పిటిషనర్‌ రేవంత్‌రెడ్డికి మినహాయింపు ఇచ్చింది. కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను మార్చి 5కు వాయిదా వేసింది. కాగా, ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారని పేర్కొంటూ బీజేపీ ఎంపీ డీకే అరుణపై నమోదైన మూడు ఎఫ్‌ఐఆర్‌లను హైకోర్టు కొట్టేసింది.

Updated Date - Feb 20 , 2026 | 01:37 AM